మాస్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు విభిన్న కథలను ఎంచుకోవడం రవితేజ ప్రత్యేకత. గతంలో ‘నా ఆటోగ్రాఫ్’, ‘నేనింతే’, ‘శంభో శివ శంభో’, ‘డిస్కో రాజా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలతో ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇమేజ్ను పక్కన పెట్టి కొత్త పాత్రలు చేయడానికి రవితేజ ఎప్పుడూ వెనుకాడలేదు.
అయితే, చూపులేని హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా మాత్రం పూర్తిగా కొత్త పాయింట్‌ను కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా మలచిన విధానానికి మంచి ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు వస్తున్న ‘ఇరుముడి’ సినిమా కూడా దాదాపు అదే బాటలో సాగుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో రవితేజ గతంలో హింసాత్మక స్వభావం, తాగుడు అలవాటు ఉన్న తండ్రి పాత్రలో నటిస్తున్నారు. కూతురితో ఉండే బంధం, మధ్యలో అయ్యప్ప దీక్షతో ఆయన జీవితంలో వచ్చే మార్పు ఈ కథకు ప్రధాన బలమని తెలుస్తోంది. ట్రైలర్లో యువతుల మరణాల చుట్టూ తిరిగే మిస్టరీని కూడా జోడించారు.
ఇది కేవలం భక్తి చిత్రం కాకుండా, తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో పాటు ఫ్యామిలీ, మిస్టరీ, యాక్షన్ అన్నీ కలగలిపిన ప్యాకేజీలా కనిపిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ చివరి నలభై నిమిషాలు ఎంతో ఇంటెన్స్‌గా ఉంటాయని చెబుతున్నారు. నా ఆటోగ్రాఫ్ లా ఇమేజ్ను పూర్తిగా మార్చేయకుండా, రాజా ది గ్రేట్ తరహాలో కొత్త పాయింట్‌కు కమర్షియల్ హంగులద్దిన ఈ ప్రయత్నం సక్సెస్ అయితే రవితేజ ఖాతాలో మరో మంచి హిట్ పడినట్లే!
