మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మిడిల్ క్లాస్ తండ్రిగా రవితేజ..
ఈ సినిమాలో రవితేజ భార్యాకూతుళ్లను ప్రాణంగా ప్రేమించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఊరిలోని ప్రతి అమ్మాయిని తన సొంత కూతురిలా భావించే మంచి మనసున్న వ్యక్తి ఆయన. అయితే తాగుడు వ్యసనానికి బానిసైన హీరో, ప్రతి ఏటా 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధరిస్తాడు. ఆ దీక్ష సమయంలో పూర్తిగా మద్యానికి దూరంగా ఉంటూ, ప్రశాంతమైన భిన్నమైన మనిషిగా మారుతుంటాడు.
క్రైమ్ ట్విస్ట్, కథాంశం..
హీరో జీవితం ఇలా సాగుతుండగా, ఆ ఊర్లో వరుసగా అమ్మాయిల హత్యలు జరగడం కలకలం రేపుతుంది. ఆ హత్యలకు కారణం ఎవరు? అయ్యప్ప దీక్షలో ఉన్న హీరో ఈ క్రైమ్ చిక్కుముడిని ఎలా విప్పాడు? హత్యలను ఎలా అడ్డుకున్నాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ యూనిక్ పాయింట్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
‘ఇరుముడి’ టైటిల్ వెనుక అసలు అర్థం..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు శివ నిర్వాణ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్‌ను బయటపెట్టారు. ఇది కేవలం భక్తి సినిమా కాదని స్పష్టం చేశారు. “ఇరుముడి అంటే ఇద్దరి మధ్య పడిన ముడి. కథలో తండ్రీకూతుళ్ల బంధం ఒక ముడి అయితే, అయ్యప్ప స్వామికి-భక్తుడికి మధ్య ఉండే నమ్మకం రెండో ముడి. అలాగే కథలో వచ్చే క్రైమ్ మిస్టరీ మూడో ముడి. ఈ మూడింటి కలయికే ‘ఇరుముడి'” అని ఆయన వివరించారు.
