టామ్ హాలండ్, జెండాయా జంటగా నటించిన హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider Man Brand New Day) భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, కేవలం 12 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రెండో వారంలోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.
కలెక్షన్ల ప్రవాహం..
సినిమా విడుదలైన రెండు వారాలు గడిచినా బాక్సాఫీస్ వద్ద దీని జోరు కొనసాగుతోంది. కేవలం సాధారణ వెర్షన్ వసూళ్లతోనే ఈ స్థాయి స్పందన రాగా, 3డీ వెర్షన్ కలెక్షన్లను కూడా కలుపుకుంటే మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.520 కోట్లకు పైగా చేరుకుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలో విడుదల కాబోయే ‘బట్వారా 1947’, ‘ఆవారాపన్ 2’ సినిమాలతో ఈ చిత్రం పోటీ పడాల్సి ఉంది. ఈ పోటీని తట్టుకుని నిలబడితే, ఫుల్ రన్లో ఈ సినిమా సులభంగా రూ.600 కోట్ల గ్రాస్ , రూ.500 కోట్ల నెట్ కలెక్షన్ల మైలురాయిని దాటుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
చారిత్రాత్మక రికార్డు దిశగా అడుగులు..
ఈ సినిమా సాధించిన వసూళ్లు, థియేటర్లకు కదిలివచ్చిన జనాల సంఖ్యను బట్టి ట్రేడ్ పండితులు దీనిని ‘ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్’గా ప్రకటించారు. భారత్‌లో ఇప్పటివరకు ఈ సినిమాను దాదాపు 1.7 కోట్ల మంది ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించారు. త్వరలోనే ఈ సంఖ్య 2 కోట్లకు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో మన దేశంలో హాలీవుడ్ నుంచి కేవలం ‘టైటానిక్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ చిత్రాలను మాత్రమే 2 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లలో చూశారు. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన రికార్డుకు ‘స్పైడర్ మ్యాన్’ చిత్రం అత్యంత చేరువలో నిలిచింది.
