హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. గతంలో తాను ఒక రిలేషన్షిప్లో ఉన్న సమయంలో తీవ్రమైన మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. ఆ బంధం వల్ల దాదాపు రెండేళ్ల పాటు మానసికంగా ఎంతో కుంగిపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రేమ ముసుగులో మానసిక వేదన..
ప్రారంభంలో ఎంతో ప్రేమగా ఉండే వ్యక్తులు, ఆ తర్వాత పూర్తిగా మారిపోతారని అనుపమ పేర్కొన్నారు. తన తప్పు లేకపోయినా నిందలను భరించాల్సి వచ్చేదని, ఆ సమయంలో చాలా క్షోభ అనుభవించానని చెప్పారు. కొంతకాలం గడిచాక అవతలి వ్యక్తి అసలు స్వభావం బయటపడిందని, తాను ఎదుర్కొన్నది పూర్తిగా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అని ఆమె స్పష్టం చేశారు. ఆ బంధం నుంచి బయటపడటం సులువు కాలేదని, దీని ప్రభావం తన వ్యక్తిగత జీవితంపైనే కాకుండా కెరీర్‌పై కూడా పడిందని తెలిపారు.
‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్స్ సమయంలోనూ ఆ వ్యక్తి తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని, సినిమా కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని చూశాడని అనుపమ వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి ఎవరనే పేరును మాత్రం ఆమె బయటపెట్టలేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
బ్రేక్అప్తో దక్కిన స్వేచ్ఛ..
ఇదివరకు కూడా అనుపమ తన బ్రేకప్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అయింది. తనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని ఆ పోస్ట్‌లో పేర్కొన్న ఆమె.. గతంలో చేసిన తప్పులు, దాటొచ్చిన క్లిష్టమైన రిలేషన్షిప్స్ వల్లే తాను మరింత మానసిక ద్రుఢత్వాన్ని సాధించానని తెలిపారు. ప్రస్తుతం ఆ బాధల నుంచి పూర్తిగా బయటపడి కెరీర్‌పై దృష్టి పెట్టానని, మునుపటికంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని అనుపమ నిరూపిస్తున్నారు.
