టాలీవుడ్లో ఇప్పుడు పూర్తిగా కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. కొత్త హీరోల విజయాలు, వంద కోట్ల సినిమాలు, భారీ బడ్జెట్ లెక్కల సంగతి పక్కన పెడితే… కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న హీరోలు, హీరోయిన్లు ఒక్కొక్కరుగా బౌన్స్‌బ్యాక్ అవుతున్నారు. అందుకే ఇది టాలీవుడ్‌కు అసలైన ‘కమ్‌బ్యాక్ సీజన్’ అని చెప్పవచ్చు.
స్టార్ హీరోల అద్భుతమైన రీఎంట్రీలు:
‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్‌కు ఒక బలమైన విజయం అవసరం కాగా, ఆ లోటును ‘పెద్ది’ సినిమా పూర్తిగా తీర్చేసింది. చరణ్ స్టార్ పవర్‌కు తగ్గ సినిమా పడితే బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం మరోసారి నిరూపించింది. నటుడిగానూ చరణ్‌కు పూర్తి సంతృప్తినిచ్చిన ఈ హిట్టుతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
అఖిల్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. కెరీర్ మొదలైనప్పటి నుంచి సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ‘లెనిన్’ చిత్రం ఆ ముగింపునిచ్చింది. అఖిల్ కెరీర్లో తొలి క్లీన్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా అతనికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని అందించింది.
సమంతకూ ‘మా ఇంటి బంగారం’ సినిమా ఎంతో కీలకమైనది. వరుస పరాజయాల తర్వాత ఆమె బాక్సాఫీస్ స్టామినాపై సందేహాలు వ్యక్తమైన సమయంలో ఈ విజయం వచ్చింది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరడం ద్వారా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద బూస్టప్ లభించిందని చెప్పవచ్చు.
వరుణ్ తేజ్ కెరీర్ కూడా వరుస నిరాశలతో కీలక దశకు చేరిన తరుణంలో వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ ఆయనకు సరికొత్త ఊపిరిపోసింది. ఒక్క విజయంతో కెరీర్ గ్రాఫ్ ఎలా మారుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణగా నిలిచింది.
రవితేజ , శివ నిర్వాణ సంచలన విజయం:
ఈ కమ్‌బ్యాక్ జాబితాలో చేరిన మరో ప్రముఖ పేరు మాస్ మహారాజా రవితేజ. ఆయన కెరీర్లో హిట్లు, ఫ్లాపులు కొత్త కాకపోయినా, వరుస పరాజయాలు ఆయన మార్కెట్‌పై కొంత ప్రభావం చూపించాయి. దీంతో అందరి దృష్టి ‘ఇరుముడి’ సినిమాపై పడింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అసాధారణ రీతిలో వసూళ్లు సాధించడంతో పాటు, తొలి రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమా కొన్నవారంతా మూడో రోజు నుంచి లాభాల బాట పట్టారు. అటు దర్శకుడు శివ నిర్వాణకు కూడా ‘ఖుషి’ తర్వాత సరైన విజయం దక్కని లోటును ఈ సినిమా పూర్తిగా తీర్చిపెట్టింది. ఇలా హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖుల సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
