సాంస్కృతిక వైవిధ్యం, మత సామరస్యం, ఐక్యతకు ప్రతీకగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రీమాంట్ నగరంలో దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఫ్రీమాంట్ సిటీ హాల్లో మేయర్ డా.రాజ్ సల్వాన్ (Dr. Raj Salwan), కౌన్సిల్వుమన్ కాథీ కింబర్లిన్ (Kathy Kimberlin) ఆధ్వర్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారికంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఫ్రీమాంట్ నగరంలో దీపావళిని శాశ్వత వార్షిక సెలవుదినంగా గుర్తించడంతో పాటు, హిందూ అమెరికన్ల సాంస్కృతిక వారసత్వాన్ని ఈ వేడుకలు ఘనంగా చాటాయి.
ఈ జెండా ఆవిష్కరణ వేడుకలో అమెరికా జాతీయ గీతం, భారతదేశ జాతీయ గీతం ‘వందేమాతరం’తో పాటు సాంప్రదాయ ధార్మిక గీతాలను ఆలపించారు. ఫ్రీమాంట్ హిందూ టెంపుల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండో-అమెరికన్స్ (FIA), ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ (FOG), అమెరికన్స్4హిందూస్ (A4H) సంస్థల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హిందూ ఆలయ వ్యవస్థాపకులు డా.రమేష్ జప్రా మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నగర అభివృద్ధికి హిందూ సంఘాలు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ, అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయం, చీకటిని తరిమే వెలుగుకు ప్రతీకగా నిలిచే దీపావళి వేడుకలు సాంప్రదాయ మిఠాయిల పంపిణీతో ముగిశాయి.
