అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ రామన్ నగరంలో “ఈస్ట్ బే కా రాజా – బే ఏరియాస్ గ్రాండ్ గణేష్ ఫెస్టివల్” అత్యంత వైభవంగా జరిగింది. బిషప్ రాంచ్ / సిటీ సెంటర్లో జరిగిన ఈ వేడుకలకు సుమారు 25 వేలకు పైగా భక్తులు, సందర్శకులు తరలివచ్చారు. ‘ఈస్ట్ బే కా రాజా’ ప్రధాన థీమ్‌గా నిర్వహించిన ఈ ఉత్సవం ద్వారా భక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. 12 అడుగుల భారీ గణేష్ విగ్రహం, సుందరంగా అలంకరించిన ప్రాంగణం, కిటకిటలాడిన దర్శన లైన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
భక్తిశ్రద్ధలతో పూజలు..
మధ్యాహ్నం 12:30 గంటలకు గణేశ ప్రతిష్ఠాపనతో ఉత్సవాలు ప్రారంభం కాగా, రోజంతా భక్తుల రాక కొనసాగింది. కుటుంబ సమేతంగా వచ్చిన ప్రజలు ఏకధాటిగా స్వామివారిని దర్శించుకున్నారు. ధూప్ హారతి, ప్రత్యేక పుష్పార్చన, సహస్ర హారతి వంటి కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం నిర్వహించిన సహస్ర హారతి, గ్రాండ్ ఢోల్ తాషా ప్రదర్శన, పల్లకీ సేవా ఊరేగింపు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్పార్టన్స్ గ్రాండ్ ఢోల్ తాషా దళం చేసిన హోరెత్తించే ప్రదర్శన మధ్య గణేష్ విగ్రహ నిమజ్జనోత్సవం కన్నులపండువగా ముగిసింది.

కమ్యూనిటీ భాగస్వామ్యం..
ఈ వేడుక కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా సాగింది. సాంస్కృతిక వేదికపై శాస్త్రీయ నృత్యాలు, భక్తి సంగీతం, గణేష్ వందన, భజనలు విశేషంగా అలరించాయి. పిల్లల కోసం ప్రత్యేక ఆర్ట్స్ అండ్ యాక్టివిటీ జోన్, గణేష్ ఆర్ట్ పోటీలను నిర్వహించగా అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ఫుడ్ స్టాళ్లు, షాపింగ్ వెండర్లు ఏర్పాటు చేయడంతో స్థానిక వ్యాపారులకు మంచి స్పందన దక్కింది.
పాల్గొన్న ప్రముఖులు , నాయకులు..
ఈ వేడుకలకు పలువురు అమెరికన్ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై గణేశుని ఆశీస్సులు అందుకున్నారు. శాన్ రామన్ వైస్ మేయర్ మెరిసోల్ రుబియో, బాట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రెసిడెంట్ మెలిస్సా హెర్నాండెజ్, డబ్లిన్ మేయర్ షెర్రీ హు, ప్లెజంటన్ మేయర్ జాక్ బాల్చ్, శాన్ రామన్ కౌన్సిల్ సభ్యులు శ్రీధర్ వెరోస్, రిచర్డ్ అడ్లర్, డబ్లిన్ కౌన్సిల్ సభ్యుడు జాన్ మోరాడా తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

విజయవంతమైన నిర్వహణ..
నిర్వాహకులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, స్థానిక సంస్థల సహకారంతో ఈ బే ఏరియా గ్రాండ్ గణేష్ ఉత్సవాలు దిగ్విజయంగా ముగిసాయి. ముఖ్య స్పాన్సర్లుగా సంజీవ్ గుప్తా (సీపీఏ), నాగరాజ్ అన్నయ్య (రియాల్టర్), విజేత ఇండియన్ సూపర్‌మార్కెట్ వంటి సంస్థలు వ్యవహరించాయి. ఈ ఉత్సవం ప్రవాస భారతీయ సమాజంలో ఐక్యతను, భక్తిభావాన్ని మరింత ఇనుమడింపజేసిందని నిర్వాహకులు తెలిపారు.
