ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రహస్యంగా పర్యటించారు. యూఏఈ రాజధాని అబుధాబిలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి మూడేళ్లు పూర్తికావొస్తున్న తరుణంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హమాస్ దాడి ముందస్తు హెచ్చరికల కలకలం..
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగి మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడికి 10 రోజుల ముందే ఇజ్రాయెల్‌కు హమాస్ భారీ ఆపరేషన్ ముప్పు ఉందని యూఏఈ హెచ్చరించిందని ప్రముఖ వార్తాపత్రిక ‘హారెట్జ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ ముందస్తు సమాచారం ప్రధాని నెతన్యాహుకు తెలిసినప్పటికీ, దానిని ఇజ్రాయెల్ సైన్యానికి లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు వెల్లడించలేదని ఆ కథనం పేర్కొనడం గమనార్హం.
ప్రతిపక్షాల డిమాండ్లు..
ఈ భద్రతా వైఫల్యానికి ప్రధాని నెతన్యాహునే పూర్తిగా బాధ్యత వహించాలని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలను నెతన్యాహు ఖండించారు. తప్పుడు కథనాలు ప్రచురించిన ఆ మీడియా సంస్థపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్యే ఆయన యూఏఈలో రహస్యంగా పర్యటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
