అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన ఘోర కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎరీ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం పెర్రీ స్ట్రీట్ ప్రాంతంలో ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతూ ఇంట్లోకి ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వచ్చేలోపే మారణహోమం..
సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికే ఇద్దరు మహిళలు విగతజీవులుగా పడి ఉన్నారు. నిందితుడు ప్రవేశించిన ఇంట్లోకి వెళ్లి చూడగా మరికొందరు రక్తపు మడుగులో శవాలుగా కనిపించారు. కాల్పులు జరిపిన నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తాము సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందే ఈ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ఎరీ నగర అధికారులు వెల్లడించారు. మృతుల వివరాలు, ఈ దాడికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
మాల్ ఆఫ్ అమెరికాపై ఉగ్రదాడి కుట్ర భగ్నం..
మరోవైపు, అమెరికాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన మాల్ ఆఫ్ అమెరికాపై భారీ దాడికి పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ సమర్థంగా అడ్డుకుంది. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)ఉగ్రవాద సంస్థ ప్రభావంతో మిన్నెసోటాలోని బ్లూమింగ్టన్లో ఉన్న ఈ మాల్లో కాల్పులు జరపాలని పథకం వేసిన 18 ఏళ్ల షేక్దూన్ అబ్దుల్లాహి మొహముద్ అనే యువకుడిని అధికారులు అరెస్ట్ చేశారు.
అండర్‌కవర్ ఆపరేషన్‌తో పట్టివేత..
నిందితుడు ఎఫ్‌బీఐ అండర్‌కవర్ ఉద్యోగికి 600 డాలర్లు చెల్లించి ఏకే-47 రైఫిల్, నాలుగు మ్యాగజైన్లు, 200 రౌండ్ల బుల్లెట్లు కొనుగోలు చేశాడు. ఆయుధాలు తీసుకుని బయటకు రాగానే అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 2024 నుంచి నిందితుడిపై నిఘా ఉంచిన ఎఫ్‌బీఐ, అతడు 30 నుంచి 60 మందిని చంపేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించింది. అక్టోబర్ 24న మాల్లో జరిగే హ్మోంగ్ ఆర్ట్స్ సెలబ్రేషన్ సమయంలో దాడికి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడిని మిన్నెసోటా కోర్టులో హాజరుపరచగా, తదుపరి విచారణ అక్టోబర్ 19న జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మాల్ పరిసరాల్లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.
