తెలుగు భాష, సాహిత్యం, ప్రదర్శన కళలను ప్రోత్సహించే ప్రముఖ సంస్థ ‘సిలికానాంధ్ర ‘ తన 25వ వార్షికోత్సవాన్ని (రజతోత్సవం) అత్యంత వైభవంగా నిర్వహించింది. ఆగస్టు 1న ఓక్లాండ్ అరెనాలో జరిగిన ఈ వేడుకలకు అమెరికా నలుమూలల నుండి 12,000 మందికి పైగా తెలుగు ప్రజలు, కళాకారులు, విద్యార్థులు తరలివచ్చారు. ఈ వేడుకల సందర్భంగా సిలికానాంధ్ర ఏకంగా మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించింది.
మూడు విభాగాల్లో రికార్డులు..
భారతీయ శాస్త్రీయ కళల మూడు ప్రధాన స్తంభాలైన రాగం, తాళం, సాహిత్యాన్ని ప్రతిబింబించేలా కర్ణాటక సంగీతం, డ్రమ్స్ వాయిద్యం, తెలుగు పద్య పఠనంలో ఈ రికార్డులు నమోదయ్యాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అజుడికేటర్ మైకెల్ ఎంపిరిక్ వేదికపైనే రెండు రికార్డులను అధికారికంగా ప్రకటించగా, మూడో రికార్డును నిర్వాహకులు వెల్లడించారు.
![]()
కర్ణాటక సంగీత బృందం: సిలికానాంధ్ర , ఆరియా యూనివర్సిటీ, సంపద (SAMPADA) సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధా రఘునాథన్ నేతృత్వంలో 1,014 మంది కళాకారులు కలిసి ప్రదర్శన ఇచ్చి ఈ రికార్డును నెలకొల్పారు. ఇంతకుముందు ఉన్న 995 మంది రికార్డును ఇది అధిగమించింది.
డ్రమ్స్ వాయిద్య బృందం: 286 మంది ప్రదర్శనకారులతో అతిపెద్ద డ్రమ్ వాయిద్య బృందంగా మరో రికార్డ్ నమోదైంది. గతంలో ఉన్న 250 మంది రికార్డును ఇది బ్రేక్ చేసింది.
పద్య పఠనం: తెలుగు పద్యాలకు సంబంధించి గిన్నిస్ రికార్డు సాధించడం ఇదే మొదటిసారి. సిలికానాంధ్ర ‘మనబడి’కి చెందిన సుమారు 1,800 మంది పిల్లలు, పెద్దలు కలిసి ‘సుమతి శతకం’, ‘వేమన శతకం’ పద్యాలను ఏకకాలంలో పఠించి ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
![]()
ప్రముఖుల హాజరు..
ఈ వేడుకల్లో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ కన్సల్ జనరల్ శ్రీకర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ లీడర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కర్ణాటక సంగీత రంగానికి సేవలు అందించిన ప్రముఖులు సుధా రఘునాథన్, కె.ఎన్. శశికిరణ్, పాత్రి సతీష్ కుమార్, తిరువూరు వైద్యనాథన్, త్రిచి శంకరన్, రమేష్ శ్రీనివాసన్ తదితరులను ఘనంగా సత్కరించారు. అలాగే అజయ్ భూటోరియాకు సిలికానాంధ్ర’ ‘అవుట్‌స్టాండింగ్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు’ అందజేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ (Gavin Newsom) తరఫున సిలికానాంధ్ర 25 సంవత్సరాల సేవలను అభినందిస్తూ అధికారిక ప్రశంసాపత్రాన్ని ఆయన అందజేశారు.
2001లో ఆనంద్ కుచిభొట్ల చేత స్థాపించిన సిలికానాంధ్ర.. అమెరికాలో తెలుగు భాషా సంస్కృతులను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రజతోత్సవ వేడుకలు ఉత్తర అమెరికాలో తెలుగు కీర్తిని మరోసారి విశ్వవ్యాప్తం చేశాయి.
![]()
