ఉత్తర అమెరికాలో తెలుగు భాషా సంస్కృతులను భావితరాలకు అందిస్తున్న ప్రఖ్యాత ‘సిలికానాంధ్రా మనబడి’ సంస్థ అరుదైన మైలురాయిని అధిగమించింది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం కేవలం 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన మనబడి, ఇప్పుడు విదేశాలలో అతిపెద్ద తెలుగు అభ్యసన ఉద్యమంగా ఎదిగింది. ప్రస్తుతం అమెరికా, కెనడా దేశాల్లోని దాదాపు 250 నగరాల్లో మనబడి కేంద్రాలు కొనసాగుతున్నాయి. కొత్త విద్యా సంవత్సర ప్రారంభ వారాంతంలో ఈ కేంద్రాల్లో మొత్తం 12,200 మందికి పైగా విద్యార్థులు చేరారు.
భారీగా తరలివచ్చిన విద్యార్థులు..
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకలకు విద్యార్థులతో పాటు సుమారు 20,000 మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా హాజరయ్యారు. అమెరికా, కెనడాల్లోని మనబడి కేంద్రాలన్నీ విద్యార్థులు, ఉపాధ్యాయుల రాకతో పండుగ వాతావరణాన్ని తలపించాయి. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సుమారు 2,500 మంది వాలంటీర్లు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు అంకితభావంతో పనిచేశారు.
తరం మారినా మారని తెలుగు భాషాభిమానం..
రెండు దశాబ్దాల క్రితం మనబడిలో చదువుకున్న తొలి బ్యాచ్ విద్యార్థులలో కొందరు నేడు తల్లిదండ్రులుగా మారి, తమ పిల్లలను కూడా మనబడికి తీసుకువస్తుండటం విశేషం. ఒక తరం నుంచి మరో తరానికి మన మాతృభాషను అందించాలన్న లక్ష్యం నెరవేరుతున్నట్లు దీనిని బట్టి స్పష్టమవుతోంది. పిల్లలకు తెలుగు మాట్లాడటం, చదవడం, రాయడంతో పాటు వారి సాంస్కృతిక మూలాలను బలపరచడమే మనబడి ప్రధాన ధ్యేయం.
అధ్యక్షుల పిలుపు..
కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ చివరి వరకు ప్రవేశాలు (అడ్మిషన్లు) కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు తెలుగు నేర్పించాలనుకునే కుటుంబాలు సమీపంలోని మనబడి కేంద్రాన్ని సందర్శించి కార్యక్రమాన్ని పరిశీలించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిలికానాంధ్రా మనబడి అధ్యక్షుడు , డీన్ చమర్తి రాజు ప్రవాస తెలుగు సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మనబడి ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తమ పిల్లలను మనబడిలో చేర్పించి మాతృభాషను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
