అమెరికాలోని బే ఏరియాలో తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న ‘తెలుగు టైమ్స్’ సంస్థ, తాజాగా తన డిజిటల్ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. బే ఏరియా వాసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త సబ్ పోర్టల్ ప్రారంభోత్సవ వేడుక ఆగస్టు 7, 2026న కాలిఫోర్నియాలో ఘనంగా జరిగింది. ఫ్రీమాంట్ నగర తొలి ఇండో-అమెరికన్ మేయర్ శ్రీ రాజ్ సల్వాన్ , మిల్పిటాస్ నగర మేయర్ శ్రీమతి కార్మెన్ మోంటానో ఈ పోర్టల్‌ను ప్రారంభించారు.
23 ఏళ్ల తెలుగు టైమ్స్ ప్రస్థానం…
2003లో బే ఏరియా గుండెకాయ లాంటి శాన్ హోసే నగరంలో ప్రారంభమైన తెలుగు టైమ్స్, రెండు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా సేవలు అందిస్తూ నేడు ప్రధాన మీడియా హౌస్‌గా మారిందని తెలుగు టైమ్స్ ఎడిటర్, సీఈఓ శ్రీ వెంకట సుబ్బారావు చెన్నూరి తెలిపారు. 2013లో సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు భాషా సంస్కృతులను భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో ‘పాఠశాల’ అనే తెలుగు బోధనా సదుపాయాన్ని ప్రారంభించగా, అది నేటికీ ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది.
2023లో 20వ వార్షికోత్సవం సందర్భంగా పెరుగుతున్న తెలుగు వ్యాపారవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు’ కూడా గొప్ప విజయాన్ని సాధించాయని ఆయన గుర్తుచేశారు. ఇ-పేపర్, ఆన్లైన్ సేవల ద్వారా పాఠకులకు చేరువైన తెలుగు టైమ్స్, అగ్రెస్సివ్ కంటెంట్, మార్కెటింగ్ వ్యూహాలతో రోజుకు లక్ష మందికి పైగా వీక్షకులను చేరుకుంటూ అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తోంది.
ఫ్రీమాంట్, శాన్ హోసే, సన్నీవేల్, మిల్పిటాస్, డబ్లిన్, శాన్ రామోన్ సహా 15 ప్రముఖ నగరాలకు అనుగుణంగా ఈ సబ్ పోర్టల్‌ను డిజైన్ చేసినట్టు వెంకట సుబ్బారావు వివరించారు.
అన్ని వర్గాల ప్రజలపై దృష్టి పెట్టాలి: ఫ్రీమాంట్ మేయర్ రాజ్ సల్వాన్
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రీమాంట్ మేయర్ శ్రీ రాజ్ సల్వాన్ మాట్లాడుతూ.. అన్ని రాజకీయాలు స్థానికంగా ఉన్నట్లే, వార్తలు కూడా స్థానిక అంశాల చుట్టూనే తిరగాలని అభిప్రాయపడ్డారు. దూర ప్రాంతాల వార్తల కంటే ప్రజలు స్థానిక వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఫ్రీమాంట్ నగరంలోని ఇతర వర్గాల అంశాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికాలో స్థిరపడిన వారు బలమైన వేర్లు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు కమ్యూనిటీకి అందిస్తున్న సేవలకు గాను సుబ్బారావు గారికి ఫ్రీమాంట్ నగర ప్రజల తరఫున అభినందన పత్రాన్ని అందజేశారు.
కమ్యూనిటీ బలోపేతానికి డిజిటల్ పోర్టల్ ఎంతో కీలకం: మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటానో
మిల్పిటాస్ మేయర్ శ్రీమతి కార్మెన్ మోంటానో మాట్లాడుతూ.. ప్రపంచంలో , స్థానికంగా ఏం జరుగుతుందో ప్రజలకు చేరవేయడంలో కమ్యూనికేషన్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ చురుగ్గా సమాచారాన్ని తెలుసుకోవడానికి, ప్రపంచ సమస్యలు, స్థానిక అంశాలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండటానికి ఈ డిజిటల్ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభినందించారు. ఈ వేడుకలో తానా, బాటా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొని తెలుగు టైమ్స్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
