అమెరికాలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో హనుమకొండ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. హసన్పర్తి మండలం గంటూర్పల్లి గ్రామానికి చెందిన 29 ఏళ్ల భరత్చందర్రెడ్డి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. గంటూర్పల్లికి చెందిన భరత్చందర్రెడ్డి కుటుంబానికి అండగా ఉంటూ హైదరాబాద్లోని ఒక బహుళజాతి సంస్థలో (ఎంఎన్సీ) ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా నగరంలో తన హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తూనే, పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా కొనసాగించాడు. చదువు పూర్తయిన వెంటనే స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకుని, తిరిగి అమెరికా వెళ్లిపోవాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు.
అగ్నిప్రమాదం ..
ఈ క్రమంలో జులై 25న జరిగిన ఒక దుర్ఘటనలో భరత్చందర్రెడ్డికి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 75 శాతం కాలిన గాయాలతో ఆయనను వెంటనే టంపా జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై, తమ కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. వైద్యులు శాయశక్తుల చికిత్స అందించినప్పటికీ, మృత్యువుతో పోరాడిన భరత్చందర్రెడ్డి చికిత్స పొందుతూ ఆగస్టు 10న తుదిశ్వాస విడిచాడు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి..
యువకుడి అకస్మిక మృతితో గంటూర్పల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కంటికి రెప్పలా పెంచుకున్న ఏకైక కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. భరత్చందర్రెడ్డి మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.
