పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తిన నాటి నుంచి అక్కడి సముద్ర జలాల్లో మోహరించిన అమెరికా విమాన వాహకనౌక ‘యూఎస్ఎస్ అబ్రహాం లింకన్’ ఇప్పుడు తిరుగు ప్రయాణమైంది. దాదాపు 200 రోజులకు పైగా సముద్రంలోనే ఉండటంతో అందులోని 5 వేల మంది వరకు నావికులు, మెరైన్లు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నౌక థాయ్‌లాండ్‌లోని పట్టాయా సమీపంలో ఉన్న లీమ్ చాబాంగ్ పోర్టు వద్ద లంగరు వేసింది.
సెక్స్ వర్కర్ల కలవరం..
థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టాయా సిటీ నైట్‌లైఫ్ , బీచ్‌లకు చాలా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ ప్రాంతంలో ఇంతకాలం విధులు నిర్వర్తించి ఇప్పుడు విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తున్న నావికులు, మెరైన్ల కారణంగా నగరంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే బీచ్‌లు, నైట్‌లైఫ్ ఏరియాల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచారు. గత వారంలో జరిపిన సోదాల్లో దాదాపు 50 మంది అనుమానిత సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు.
వ్యాపార వర్గాల్లో ఆనందం..
నావికుల రాక వల్ల కొన్ని సామాజిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ, ఇది పట్టాయా ఆర్థిక వ్యవస్థకు మాత్రం కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నగరం పూర్తిగా పర్యాటకం, వినోద రంగంపైనే ఆధారపడి ఉంది. నౌక రాకతో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, దుకాణాలు , ఇతర వ్యాపారాలు మరింత లాభసాటిగా మారుతాయని అక్కడి వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
