టెన్నిస్ క్రీడకు మరింత పాపులారిటీ తెచ్చే ప్రయత్నంలో భాగంగా యూఎస్ ఓపెన్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను ప్రోత్సహించడం, కోర్టుల వద్ద మద్యం, గంజాయి వినియోగం శృతిమించడం టోర్నీ పరువును బజారున పడేలా చేస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కోర్టుల్లో ఇన్ఫ్లూయెన్సర్ల హడావుడి..
గత టోర్నీలో 54 మంది కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే మీడియా క్రెడెన్షియల్స్ ఇవ్వగా, ఈసారి ఆ సంఖ్య ఏకంగా 100 దాటింది. అయితే వీరి తీరు ఆటగాళ్లకు, ప్రేక్షకులకు తీవ్ర చికాకు తెప్పిస్తోంది. దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఆడుతున్న ఎగ్జిబిషన్ మ్యాచ్‌లోనూ ఇన్ఫ్లూయెన్సర్లు పక్కనవారిని పట్టించుకోకుండా పెద్దపెద్దగా మాట్లాడుతూ డిస్టర్బ్ చేశారు. మరోవైపు, ఒసాకా – జఖరోవా మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ కొందరు శక్తిమంతమైన రింగ్ లైట్లు వెలిగించి వీడియోలు తీయడం వివాదస్పదమైంది. ఆటగాళ్లు తమ వృత్తిపై ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నిస్తుంటే, క్రియేటర్ల తీరు అగౌరవంగా ఉందని టెన్నిస్ స్టార్ జెస్సికా పెగులా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
గంజాయి, మద్యం జోరు..
అమెరికాలో మ్యాచ్‌లు చూస్తూ మందు తాగడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి అది పరిధి దాటింది. న్యూయార్క్‌లో పరిమితంగా గంజాయి తీసుకోవడం చట్టబద్ధం కావడంతో, టెన్నిస్ కోర్టుల పరిసర ప్రాంతాల్లో దీని వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది అచ్చం రేవ్ పార్టీని తలపించేలా ఉందని, తాము ఏకాగ్రతతో ఆడలేకపోతున్నామని పలువురు క్రీడాకారులు వాపోయారు.
రికార్డు స్థాయిలో అమ్మకాలు..
యూఎస్ ఓపెన్‌లో అత్యంత ఫేమస్ అయిన ‘హనీ డ్యూస్’ (వోడ్కా, నిమ్మరసం, రాస్బెర్రీ లిక్కర్ మిశ్రమం) కాక్టెయిల్స్కు ఈసారి డిమాండ్ తారస్థాయికి చేరింది. గతేడాది 7.38 లక్షలకు పైగా క్యాన్లు అమ్ముడవ్వగా… 17 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఆ రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే 8 వేలకు పైగా కేసులు (ఎనిమిది సెమీ ట్రంక్స్) హనీ డ్యూస్‌ను న్యూయార్క్‌కు రప్పించారు. టోర్నీ ఇంకా పది రోజులు ఉండటంతో అమ్మకాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అయితే మత్తు ఎక్కువై మ్యాచులకు అంతరాయం కలిగే ప్రమాదం ఉండటంతో, నిర్వాహకులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే టోర్నీ గౌరవమే మంటగలుస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
