-ప్రసాదరావు రామాయణం
కాలిఫోర్నియా కేంద్రంగా తెలుగు భాషా సాహిత్యాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్న ‘వీక్షణం’ సాహితీ గవాక్షం సంస్థ 14వ వార్షికోత్సవం సెప్టెంబరు 18, 19 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని ఫ్రీమౌంట్‌లో ప్రత్యక్షంగాను, అదే సమయంలో అంతర్జాలంలోనూ ఈ వేడుకలు కన్నులపండువగా సాగాయి. గత 14 ఏళ్లుగా (168 నెలలు) ఎలాంటి అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా నెలనెలా సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న ఈ సంస్థ, ప్రపంచ సాహిత్య చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకుంది. 2012లో డా. కె. గీతామాధవి స్థాపించిన ఈ వేదిక నేడు కాలిఫోర్నియా దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహితీ ప్రియులను ఒక్కచోట చేర్చుతోంది.
ప్రత్యక్ష , ఆన్లైన్ వేడుకల విశేషాలు..
సెప్టెంబరు 19న ఫ్రీమౌంట్లోని శ్రీమతి షంషాద్, శ్రీ అబ్దుల్లా నివాసంలో జరిగిన ప్రత్యక్ష సమావేశం అత్యంత ఆసక్తికరంగా సాగింది. డా. కె. గీతామాధవి ఆహ్వానం మేరకు.. కిరణ్ ప్రభ, కాంతి కిరణ్, డా. సురేందర్ రెడ్డి, సి. భాస్కరరావు, రమణ, శారద కాశీవఝల, షంషాద్ తదితరుల ఆధ్వర్యంలో వీక్షణం ప్రత్యేక సాహితీ సంచిక, సమీక్షల సంచికలు ఆవిష్కరించారు. ఇదే వేదికపై కిరణ్ ప్రభ చేతుల మీదుగా వెంకట్ నాగం రాసిన ‘కలగూర గంప’, ‘రచ్చబండ చర్చలు’ పుస్తకాలతో పాటు, డా. గీతామాధవి రచించిన ‘అనగనగా అమెరికా’ కాలమ్స్ పుస్తకం విడుదలయ్యాయి. ఆ తర్వాత కిరణ్ ప్రభ అందించిన “జిడ్డు కృష్ణమూర్తి జీవనాదర్శం” ప్రత్యేక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
మరోవైపు సెప్టెంబరు 18, 19 తేదీల్లో జరిగిన అంతర్జాల (Online) సమావేశంలో వివిధ ప్రముఖులు భాగస్వామ్యమయ్యారు. భారతీయ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సాహిత్యవేత్త డా. నాగభైరవ ఆదినారాయణ, మహిళా ఉద్యమకారిణి శ్రీమతి తేళ్ల అరుణలను సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాగభైరవ ఆదినారాయణ , తేళ్ల అరుణలు వీక్షణం ప్రత్యేక సంచికలను, సమీక్షా గ్రంథాలను ఆవిష్కరించి కవులను అభినందించారు. ప్రసాదరావు రామాయణం ప్రత్యేక సంచికలోని కవితలు, వ్యాసాల విశేషాలను సభకు వివరించారు.
కవిసమ్మేళనం , పుస్తక Sanchika లింకులు..
కార్యక్రమంలో భాగంగా శ్రీ రాజేంద్ర ప్రసాద్, శ్రీమతి రాధాకుసుమల ఆధ్వర్యంలో భారీ కవిసమ్మేళనం నిర్వహించారు. ఇందులో వసీరా, మౌనశ్రీ మల్లిక్‌తో పాటు దాదాపు 40 మంది ఉద్దండులైన కవులు (ముఖ్యంగా కవయిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని) తమ అద్భుతమైన కవితలను వినిపించి శ్రోతలను అలరించారు. చివరిగా నిర్వాహకులు డా. గీతామాధవి, రాజేంద్ర ప్రసాద్‌లు వందన సమర్పణతో ఈ వేడుకలను విజయవంతంగా ముగించారు.
ఈ వార్షికోత్సవానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు , ప్రత్యేక సంచికల డిజిటల్ లింకులు క్రింద ఉన్నాయి.
వీక్షణం ప్రత్యక్ష & ఆన్లైన్ ఫోటోల లింక్: Google Drive Folder
అంతర్జాల సమావేశ వీడియో: YouTube Link
కాలిఫోర్నియా ప్రత్యక్ష సమావేశ వీడియో: YouTube Link
వీక్షణం సాహితీ మిత్రుల రచనల ప్రత్యేక సంచిక-2026: PDF Link
వీక్షణం 14 సంవత్సరాల సమావేశాల సంచిక-2026: PDF Link
