అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్, నైత్రి(Neythri) సంస్థతో కలిసి అంబాసిడర్ లక్ష్మీ పురి రచించిన బెస్ట్-సెల్లింగ్ నవల స్వాలోయింగ్ ది సన్(Swallowing the Sun) పుస్తకంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్టెంట్ సెక్రటరీ-జనరల్ అయిన అంబాసిడర్ లక్ష్మీ పురి ఈ నవల ద్వారా భారతదేశ స్వాతంత్ర్య సమర యుగాన్ని, జాతీయ స్వేచ్ఛకు, మహిళల ఆత్మసాక్షాత్కారానికి మధ్య ఉన్న సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
నవలలోని ముఖ్యంశాలు…
ఈ కార్యక్రమంలో లక్ష్మీ పురి మాట్లాడుతూ.. తమ కేజ్డ్ బర్డ్(పంజరంలో చిక్కుకున్న పక్షి) స్థితిని దాటి సొంత గుర్తింపును, గొంతును వెతుక్కున్న గుర్తింపు లేని హీరోలు , షీరోలను(unsung heroes and sheroes) ఈ నవలలో ప్రతిబింబించినట్లు తెలిపారు. నవలపై మహాత్మా గాంధీ ప్రభావం, వలసవాదం, సామాజిక ఆంక్షలకు వ్యతిరేకంగా సాగిన సమాంతర పోరాటాలు, అలాగే ఈ టైటిల్ వెనుక ఉన్న స్ఫూర్తి, విశ్వాసం, దృఢ సంకల్పం గురించి చర్చించారు. భారత స్వాతంత్ర్య సమర యుగానికి జీవం పోయడంలో చారిత్రక కల్పనల శక్తి ఎంతగానో ఉంటుందని, నవలకు గాంధేయ ఆదర్శాలతో ఉన్న అనుబంధాన్ని కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ కొనియాడారు.
ఫైర్‌సైడ్ చాట్…
ఈ కార్యక్రమం ముగింపు దశలో అంబాసిడర్ లక్ష్మీ పురి, నైత్రికి చెందిన బింద్యా ఖన్నా మధ్య ఒక ఫైర్‌సైడ్ చాట్ నిర్వహించారు. ఈ సంభాషణలో నవలలోని కొన్ని ముఖ్యమైన భాగాలను చదువుతూ దానిలోని ఇతివృత్తాలపై లోతైన చర్చ చేపట్టారు. ప్రవాస భారతీయులు , సాహిత్య ప్రియులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
