కృత్రిమ మేధ (AI) అడ్డూఅదుపు లేకుండా అభివృద్ధి చెందితే మానవాళి మనుగడకే ప్రమాదమంటూ ఏఐ పరిశ్రమ అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, దీనిపై నియంత్రణ అనేది కత్తిమీద సాములా కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ పోటీ, లాభాపేక్ష ధోరణులు, ప్రభుత్వ విధానాలను సమన్వయం చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, కొన్ని ప్రతిపాదనలపై మాత్రం ఏకాభిప్రాయం కుదురుతోంది.
ప్రధాన ప్రతిపాదనలు , చర్చలు..
ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ, స్పేస్ ఎక్స్ వంటి అగ్రగామి సంస్థలు తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై స్వతంత్ర, బాహ్య మూల్యాంకనకర్తలకు నిరంతర పరిశీలనా అధికారం ఇవ్వాలని ఆంత్రోపిక్ అధిపతి అమోడ్ ప్రతిపాదించగా, ఆల్ట్మన్ దీనిని సమర్ధించారు. జీవయుధాల తయారీకి ఏఐని ఉపయోగించడం వంటి ప్రమాదకర కార్యకలాపాల నిషేధానికి దేశాల మధ్య ఒప్పందాలు కుదరాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, సోవియట్ యూనియన్లు తాము ఉత్పత్తి చేసే అణు క్షిపణుల సంఖ్యను పరిమితం చేసినట్లుగానే.. ఏఐ పురోగతి రేటుపై కొన్ని నిబంధనలు విధించాలని అమోడ్ సూచించారు.
నిపుణుల అభిప్రాయాలు..
ఏఐ వేగ నియంత్రణ సిద్ధాంతపరంగా సాధ్యమే అయినప్పటికీ, ఆచరణలో ఇది సవాళ్లతో కూడుకున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, జీవయుధ ముప్పుల వంటి రంగాల్లో నియంత్రణ ప్రమాణాల రూపకల్పన, ఏఐ మోడళ్లను విడుదల చేయడానికి ముందే పరీక్షించడం వంటి అంశాల్లో అమెరికా, దాని ప్రత్యర్థుల మధ్య ఏకాభిప్రాయం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. చైనాను అధిగమించాలనే ఉద్దేశంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఏఐపై పకడ్బందీ నియంత్రణకు సుముఖంగా లేరని ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ శాంద్రా వాక్టర్ అభిప్రాయపడ్డారు. ఏఐ కంపెనీలు సాంకేతికత ద్వారా ఎదురయ్యే ముప్పులకు బాధ్యత వహించడం, డేటా సెంటర్లకు వనరులను పొందే అవకాశాలను పరిమితం చేసే నిబంధనలు పాటించడం వంటివి ఏఐ వేగ నియంత్రణకు తోడ్పడతాయని ఆమె పేర్కొన్నారు.
