ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు ఏకంగా ఇంద్రుడే కారణమంటూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక వ్యక్తి అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హర్దోయ్ జిల్లాకు చెందిన సూరజ్ తివారీ రాష్ట్ర ప్రజా ఫిర్యాదుల పోర్టల్ ద్వారా ఈ వినతిని సమర్పించగా, ఇది నెట్టింట వైరల్గా మారింది.
వింత ఫిర్యాదు..
కొన్నిసార్లు భారీగా, మరికొన్నిసార్లు నెమ్మదిగా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంద్రదేవుడు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వర్షాలు కురిపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అందులో తెలిపారు. రోడ్లు, వీధులు, లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా మేజిస్ట్రేట్కు విన్నపం..
తనకు ఇంద్రుడి ఫోన్ నంబర్ తెలియదని సూరజ్ తివారీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఇంద్రుడికి తగు ఆదేశాలు జారీ చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన జిల్లా మేజిస్ట్రేట్ను అభ్యర్థించారు.
