జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే ఆధునిక వైద్య పరిశోధనలపై ప్రముఖ ఫార్మా సంస్థ ‘నాట్కో’ ప్రత్యేక దృష్టి సారించింది. అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ ‘ఇజెనెసిస్’లో తమ పెట్టుబడులను గణనీయంగా పెంచుతున్నట్లు నాట్కో ఫార్మా అధికారికంగా ప్రకటించింది.
గతంలో ఈ సంస్థలో 14 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 133 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించగా, తాజాగా దానిని 16.7 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 159 కోట్లకు) పెంచుతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. నాట్కో ఫార్మాకు చెందిన పూర్తిస్థాయి అనుబంధ సంస్థలైన ‘నాట్కోఫార్మా కెనడా ఇంక్.’ , ‘నాట్కోఫార్మా యూఎస్ఏ ఎల్ఎల్సీ’ల ద్వారా ఈ నిధులను సమకూర్చనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి ఈ పెట్టుబడి ప్రక్రియ పూర్తిగా ముగియనుంది. కాగా, గతంలో 2024 సంవత్సరంలోనూ అమెరికా సంస్థలో నాట్కో ఫార్మా 8 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది.
పరిశోధనల ముఖ్య ఉద్దేశం..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ అవయవాల మార్పిడికి తీవ్రమైన కొరత వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ‘ఇజెనెసిస్’ సంస్థ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. జన్యుపరమైన మార్పులు చేసిన పంది అవయవాలను భవిష్యత్తులో మానవులకు విజయవంతంగా మార్పిడి చేయవచ్చనే లక్ష్యంతో ఈ రీసెర్చ్ సాగుతోంది. పంది కిడ్నీలను మనుషులకు అమర్చడం, తీవ్రమైన కాలేయ వైఫల్యానికి చికిత్స అందించడం , గుండె మార్పిడి తదితర అంశాలపై ఆ సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే 2024 మార్చిలో పంది కిడ్నీని ఒక మనిషికి విజయవంతంగా అమర్చినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఈ ప్రయోగాలు క్లినికల్ దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు ఎలాంటి వాణిజ్య ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకోలేదని కంపెనీ స్పష్టం చేసింది.
