OPEN AI MODELS: ఏఐ ఏజెంట్లు కట్టుతప్పి ప్రవర్తిస్తుండడంతో .. ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ మోడళ్ల (AI Models) శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అవి తాము అప్పగించిన పనులకు మించి ముందుకు వెళ్తుండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇటువంటి హ్యాకింగ్‌లను ఎదుర్కొనేలా అదనపు భద్రతా చర్యలు అందుబాటులో ఉన్నాయని తమకు పూర్తి నమ్మకం కలిగిన తర్వాతే శిక్షణను తిరిగి ప్రారంభిస్తామంది. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. ఇతర సమస్యలు తలెత్తుతుండడంతో పలుమార్లు తమ మోడళ్ల ట్రైనింగ్‌ను నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది.
మూడు నెలల్లో ఓపెన్ ఏఐ (OpenAI) తన మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయడం ఇది రెండోసారి. జులైలో AI స్టార్టప్ ‘హగ్గింగ్ ఫేస్’ను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించడంతో కొద్ది రోజుల పాటు ట్రైనింగ్‌ను నిలిపివేసింది. దీంతో ఏజెంట్లు సొంతంగా ప్రవర్తించడం, వెబ్సైట్లను హ్యాక్ చేయడం, గోప్య సమాచారాన్ని బహిర్గతం చేయడం వంటి వాటిని నిరోధించేందుకు.. రక్షణ చర్యలు చేపట్టాలని అమెరికా చట్టసభ సభ్యులు ఏఐ ల్యాబ్‌లపై ఒత్తిడి పెంచుతున్నారు. ఓపెన్ఏఐ ప్రత్యర్థి ఆంథ్రోపిక్ అధిపతులు కూడా ఏఐ అభివృద్ధికి కళ్లెం వేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి శిక్షణను నిలిపివేసింది.
అమెరికా ప్రభుత్వ వెబ్సైట్లలోకి తమ ఏఐ ఏజెంట్లు చొరబడినప్పటికీ..వాటికి సంబంధించిన విలువైన సమాచారాన్ని, ప్రజలకు అందుబాటులో లేని సమాచారాన్నిగానీ అవి సేకరించలేదని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. ప్రజలకు అందుబాటులో ఉండే సమాచారాన్నే యాక్సెస్ చేసినట్లు తెలిపింది. భద్రతా ఉల్లంఘనలకు సంబంధించిన చర్యలను తాము నిరంతరం పరిశీలిస్తున్నామంది.
