నాయకత్వ హోదాల కంటే ఉద్యోగ-వ్యక్తిగత జీవిత సమతుల్యతకే భారత జెన్-జీ (Gen-Z) అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. కేవలం పెద్ద పదవులు, ఎక్కువ జీతాలు మాత్రమే విజయానికి కొలమానాలు కావని నేటి యువత భావిస్తోంది. ప్రముఖ గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ ‘ఎమిరిటస్’ ఈ సర్వేను నిర్వహించింది. భారత్లోని ప్రధాన నగరాల్లో 15 నుంచి 28 ఏళ్ల వయస్సు గల 1,010 మందిపై ఈ సర్వే చేపట్టి, వారి ఉన్నత విద్య, నైపుణ్యాలు విదేశీ చదువులపై అభిప్రాయాలను సేకరించింది.
సమతుల్యతకే ప్రథమ ప్రాధాన్యం..
భారత జెన్-జీ యువతలో దాదాపు 74 శాతం మంది ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. నాయకత్వ హోదాల కంటే పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్కే తాము మొగ్గు చూపుతున్నట్లు వీరు స్పష్టం చేశారు. కెరీర్లో విజయవంతం కావడానికి ఎగ్జిక్యూటివ్ లేదా ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదగాల్సిన అవసరం లేదని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు.
విదేశీ చదువులపై తగ్గుతున్న ఆసక్తి..
విదేశాల్లో చదువుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో ప్రస్తుతం 48 శాతం మందికి మాత్రమే దానిపై ఆసక్తి ఉంది. నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న ఖర్చులు, వీసా ఇబ్బందులు, అలాగే చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగ అవకాశాలపై నెలకొన్న అనిశ్చితి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా అమెరికాలో చదువుకోవాలనే తపనలో గమనించదగ్గ స్థాయిలో తగ్గుదల కనిపించింది.
దేశంలోనే చదువుకునేందుకు మొగ్గు..
విదేశాలకు వెళ్లడం కంటే భారత్లోనే అంతర్జాతీయ రేటింగ్ ఉన్న యూనివర్సిటీల్లో మంచి కోర్సులు అభ్యసించేందుకు యువత ఆసక్తి చూపుతోంది. అంతేకాకుండా, భారత్లో చదువుతూ కొంతకాలం విదేశీ యూనివర్సిటీ ప్రాంగణంలో చదవడం లేదా సెమిస్టర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లలో పాల్గొనడం వంటి హైబ్రిడ్ విద్యా విధానానికి కూడా ఆదరణ పెరుగుతోంది.
