అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన గుజరాత్‌కు చెందిన ముగ్గురు యువతీయువకుల ఆచూకీ గల్లంతైంది. కిడ్నాప్ చేసినట్లు దుండగులు ఫోన్ చేసి భారీగా డబ్బు డిమాండ్ చేస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన మమతా చద్వా, రుత్విక్ జన్సారీ, మయూరీ సోలంకీలు అక్రమ మార్గంలో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ట్రావెల్ నెట్‌వర్క్‌కు చెందిన అల్పేశ్ పంచల్, భార్గవ్ పటేల్‌తో ఒక్కొక్కరికి రూ.75 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మమత భర్త మూడేళ్లుగా విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటుండగా, ఆమె వీసా దరఖాస్తు తిరస్కరణకు గురికావడంతో ఈ అక్రమ మార్గాన్ని ఆశ్రయించారు.
ఇథియోపియాలో ఆచూకీ గల్లంతు..
సెప్టెంబర్ 20న వీరు రాజస్థాన్ నుంచి అబుధాబి మీదుగా ఇథియోపియా చేరుకున్నారు. సెప్టెంబర్ 22న కెనడా చేరుకున్నామని మమత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. మూడు రోజుల తరువాత గుర్తుతెలియని వ్యక్తి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చి, వారిని కిడ్నాప్ చేశామని.. విడిచిపెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
పోలీసుల దర్యాప్తు..
అప్పటికే ఏజెంట్లకు భారీగా చెల్లించి ఆర్థిక కష్టాల్లో ఉన్నామని, ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ పిల్లలను కాపాడాలని మమత తండ్రి వేడుకుంటున్నారు. మరోవైపు తాము కిడ్నాపర్లకు ఇప్పటికే రూ.60 లక్షలు ఇచ్చామని, వారు అదనంగా మరో కోటి రూపాయలు అడుగుతున్నారని ఏజెంట్ అల్పేశ్ పంచల్ తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
