భారత సెక్యూరిటీల్లో (ఈక్విటీలు, బాండ్లు) అమెరికా పెట్టుబడులు పదేళ్ల వ్యవధిలో ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. 2015లో భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 130 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12.35 లక్షల కోట్లు) ఉండగా.. 2025 నాటికి అది 390 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 37 లక్షల కోట్లు) చేరినట్లు అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. అమెరికా పోర్ట్ఫోలియో పెట్టుబడులు అధికంగా ఉన్న 30 దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. ఈ అమెరికా పెట్టుబడులు అత్యధికంగా కేమన్ దీవుల స్టాక్ మార్కెట్లలో ఉన్నాయి. 2025 సంవత్సరానికి విదేశీ సెక్యూరిటీలపై అమెరికా పోర్ట్ఫోలియో పెట్టుబడులపై నిర్వహించిన వార్షిక సర్వేకు సంబంధించిన ప్రాథమిక గణాంకాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ వార్షిక సర్వేను అమెరికా ఆర్థిక శాఖ, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సంయుక్తంగా నిర్వహించాయి.
ఈక్విటీల్లోనే పెట్టుబడులు..
2025 నాటికి విదేశీ దేశాల సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువను 19.3 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇందులో ఈక్విటీల్లో 15.3 ట్రిలియన్ డాలర్లు, విదేశీ దీర్ఘకాలిక డెట్ సెక్యూరిటీల్లో (ఒక సంవత్సర కంటే ఎక్కువ కాలపరిమితి కలిగినవి) 3.6 ట్రిలియన్ డాలర్లు, విదేశీ స్వల్పకాలిక డెట్ సెక్యూరిటీల్లో 0.4 ట్రిలియన్ డాలర్లు చొప్పున ఉన్నాయి. గత సర్వేలో అమెరికా పెట్టుబడుల విలువ 15.8 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ఈక్విటీల్లో 12.1 ట్రిలియన్ డాలర్లు, విదేశీ దీర్ఘకాలిక డెట్ సెక్యూరిటీల్లో 3.4 ట్రిలియన్ డాలర్లు, విదేశీ స్వల్పకాలిక డెట్ సెక్యూరిటీల్లో 0.4 ట్రిలియన్ డాలర్లు చొప్పున ఉన్నాయి.
చైనా కంటే భారత్లోనే ఎక్కువ..
భారత ఈక్విటీల్లో అమెరికా పోర్ట్ఫోలియో పెట్టుబడుల విలువ 2025 చివరి నాటికి 380 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది 373 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత దీర్ఘకాలిక డెట్ సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడులు 10 బిలియన్ డాలర్ల నుంచి 11 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ గణాంకాలు అమెరికా పెట్టుబడిదారులు కలిగి ఉన్న భారత సెక్యూరిటీల మార్కెట్ విలువను సూచిస్తాయి. వీటిలో తయారీ కేంద్రాలు, భౌతిక సదుపాయాలు, ఇతర భౌతిక ఆస్తులలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను చేర్చలేదు. చైనాలో అమెరికా పోర్ట్ఫోలియో పెట్టుబడుల విలువ 318 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 300 బిలియన్ డాలర్లు చైనా ఈక్విటీలలోను, 17 బిలియన్ డాలర్లు దీర్ఘకాలిక చైనా డెట్ పత్రాలలోనూ ఉన్నాయి.
టాప్ 5 దేశాలు..
అమెరికా సెక్యూరిటీలలో అత్యధిక పెట్టుబడులు కలిగి ఉన్న అగ్రశ్రేణి ఐదు దేశాల జాబితాలో కేమన్ దీవులు 3.073 ట్రిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో యూకే 2.007 ట్రిలియన్ డాలర్లు, కెనడా 1.886 ట్రిలియన్ డాలర్లు, జపాన్ 1.483 ట్రిలియన్ డాలర్లతో కొనసాగుతుండగా, ఐర్లాండ్ 1.182 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఐదో స్థానంలో ఉంది.
