అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా విధానంలో రానున్న రోజుల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంటోనీ డి ఎస్పోనిటో వ్యాఖ్యానించారు. మరో ఏడాదిలో విదేశీ కార్మికుల వీసా కార్యక్రమం ఇప్పుడున్న విధంగా ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అమెరికా యూట్యూబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడైంది.
వీసా వ్యవస్థలో అక్రమాలపై దర్యాప్తు..
విదేశీ కార్మికుల వీసా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రంగా ఆధారాలు సేకరిస్తోందని డి ఎస్పోనిటో తెలిపారు. ఇది కేవలం పత్రాల పరిశీలనకు సంబంధించిన విషయం కాదని, వాస్తవంగా జరుగుతున్న వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఈ వ్యవస్థలో అసలు ఏం జరుగుతుందో స్పష్టంగా తెలిసేలా తగిన ఆధారాలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
వీసా విధానంలో రాబోయే మార్పులు..
సరిగ్గా ఇప్పటి నుంచి 365 రోజుల్లో విదేశీ కార్మికుల వీసా కార్యక్రమం పూర్తిగా భిన్నంగా కనిపించవచ్చని డి ఎస్పోనిటో అంచనా వేశారు. అయితే, హెచ్-1బీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ఆయన ఎక్కడా ప్రకటించలేదని స్పష్టమైంది. రానున్న రోజుల్లో దర్యాప్తులు, కంపెనీలపై చర్యలు , విధానపరమైన మార్పులు మరింత పెరిగే అవకాశం ఉందని దీని ద్వారా స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.
