అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, పలు వ్యాపారాలకు హోల్డింగ్ కంపెనీగా ఉన్న బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్ బాధ్యతల నుంచి అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (96) వైదొలిగారు. 1970 నుంచి అంటే సుమారు 56 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఇకపై బెర్క్‌షైర్ హాథ్వేకు గౌరవ చైర్మన్‌గా వారెన్ బఫెట్ ఉండనున్నారు. అలాగే బోర్డు డైరెక్టర్‌గా, సలహాదారు పాత్రలోనూ ఆయన కొనసాగుతారని కంపెనీ తెలిపింది.
కొత్త చైర్మన్‌గా కుమారుడు:
వారెన్ బఫెట్ కుమారుడు అయిన హోవార్డ్ బఫెట్ కంపెనీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించారు. హోవార్డ్ బఫెట్ 1993 నుంచి బెర్క్‌షైర్ హాథ్‌వే బోర్డులో ఉన్నారు. గతేడాది చివరిలో కంపెనీ సీఈఓ పదవి నుంచి వారెన్ బఫెట్ వైదొలగడంతో, ఆయన స్థానంలో గ్రెగ్ ఏబెల్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. “నేను 1965 నుంచి బెర్క్‌షైర్‌కు సేవలు అందిస్తున్నాను. ఇక నుంచి బెర్క్‌షైర్ హాథ్‌వేను సీఈఓ గ్రెగ్ ఏబెల్, హోవార్డ్ బఫెట్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారనే విశ్వాసం నాకు ఉందని” వారెన్ బఫెట్ తెలిపారు.
సంపద , విరాళాలు:
2026 జులై నాటికి వారెన్ బఫెట్ సంపద విలువ 140 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 13.50 లక్షల కోట్లు) పైగా ఉంది. బెర్క్‌షైర్ హాథ్‌వే షేర్ల ద్వారానే ఇది సమకూరింది. 2006 నుంచి ఇప్పటివరకు సుమారు 66 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6 లక్షల కోట్లు) విలువైన మొత్తాన్ని ఆయన వివిధ రంగాలకు విరాళంగా ఇచ్చారు. 2024లో నాన్ టెక్ కంపెనీల్లో లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువ సాధించిన మొదటి కంపెనీగా బెర్క్‌షైర్ హాథ్‌వే నిలిచింది. ప్రస్తుతం బీమా, ఇంధనం, రైల్వే, తయారీ, రిటైల్ రంగాల్లో అనేక అనుబంధ కంపెనీలు బెర్క్‌షైర్ హాథ్‌వే ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
