ప్రముఖ మీడియా సంస్థలతో నెలకొన్న వివాదాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్వేతసౌధానికి సంబంధించిన కార్యక్రమాలు, తన ప్రసంగాలు , ప్రభుత్వ సమాచారాన్ని నేరుగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ‘ట్రంప్ టీవీ’ పేరుతో సరికొత్త 24/7 ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు.
ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నాయన్న ఆరోపణలతో సీఎన్ఎన్, ఎంఎస్ఎన్బీసీ, పొలిటికో వంటి మీడియా సంస్థల విలేకరులపై శ్వేతసౌధంలోకి ప్రవేశించకుండా ట్రంప్ గతంలో నిషేధం విధించారు. దీనిని సవాలు చేస్తూ ఆ సంస్థలు కోర్టును ఆశ్రయించగా, మరోవైపు ట్రంప్ కార్యక్రమాలను ప్రసారం చేయకూడదని పలు ఛానళ్లు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో తననెవరూ బాయ్‌కాట్ చేయలేరని స్పష్టం చేసిన ట్రంప్.. ఈ కొత్త టీవీ ఛానెల్‌ను అందుబాటులోకి తీసుకురావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
గ్రీన్‌లాండ్‌పై కీలక ఒప్పందం..
మరోవైపు గ్రీన్లాండ్ అంశంపై ట్రంప్ తన వైఖరిలో మార్పు చేసుకున్నారు. గతంలో గ్రీన్లాండ్ అమెరికాలో భాగం కావాలని డిమాండ్ చేసిన ఆయన, తాజాగా డెన్మార్క్ , గ్రీన్లాండ్ అధికారులతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్లాండ్లో అమెరికా సైనిక బలగాల మోహరింపు మరింత పెరగనుంది. అయితే, ఆ దీవిపై నియంత్రణ మాత్రం పూర్తిగా డెన్మార్క్ చేతుల్లోనే కొనసాగుతుంది. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ట్రంప్ మంగళవారం సంతకాలు చేశారు.
