ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్ అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్‌హౌస్‌లో ప్రముఖ టెక్ దిగ్గజాల ప్రతినిధులతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకమైన ‘ఏఐ అకార్డ్’ను ఆవిష్కరించారు.
స్వచ్ఛంద భద్రతకు టెక్ కంపెనీల అంగీకారం..
ఈ ఒప్పందం ద్వారా ఏఐ టెక్నాలజీని నైతిక మార్గంలో నడిపించే బాధ్యతను అగ్రశ్రేణి టెక్ కంపెనీలు స్వచ్ఛందంగా స్వీకరించాయి. దీని ప్రకారం ఆయా కంపెనీలు తమంతట తామే ఐటీ భద్రతను సమీక్షించుకోవడంతో పాటు, అంతర్గత , బాహ్య తనిఖీలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఏఐ రంగ అభివృద్ధిని ప్రభుత్వం నియంత్రించదని, అడ్డుకోదని స్పష్టం చేసిన ట్రంప్.. ఈ రంగాన్ని ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అని పిలవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త పోర్టల్ ప్రారంభం..
ప్రభుత్వ సమాచారం , సేవలను పౌరులకు సులభంగా అందించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం AI ఆధారిత America.gov వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ సైట్‌లోని ఏఐ చాట్‌బాట్ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో కొన్ని తప్పులు దొర్లాయి. ముఖ్యంగా ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ పేరు ఉందని ఆ చాట్‌బాట్ సమాధానం ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే కొద్దిసేపటికే ఆ సైట్ తన సమాధానాలను సవరించుకోవడం గమనార్హం.
