అమెరికా, బ్రిటన్లకు చెందిన ప్రఖ్యాత విదేశీ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు అమెరికా, బ్రిటన్లలో పర్యటించిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక నివేదికను అందజేసింది.
ఈ నివేదికను స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ విదేశీ పర్యటన అంతర్జాతీయ వర్సిటీలతో భాగస్వామ్యం ఊపిరి పోసిందని హర్షం వ్యక్తం చేసిన ఆయన.. మన రాష్ట్ర విద్యార్థులకు, యువతకు హైదరాబాద్‌లోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, నైపుణ్యాలు అందేలా ఈ ఒప్పందాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
రూపుదిద్దుకుంటున్న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు తనే స్వయంగా నాయకత్వం వహిస్తానని సీఎం ప్రకటించారు. ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గ్లోబల్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటైతే మరిన్ని ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు రాష్ట్రానికి తరలివస్తాయని తెలిపారు. రాబోయే డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్’లో ప్రపంచ విద్యాసంస్థల భాగస్వామ్యం, క్రీడారంగాభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీధర్, డా.ఎన్సీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ వైస్ చైర్పర్సన్ ఎ. శాంతికుమారి, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
నివేదికలోని అంశాలు..
అమెరికాలోని అత్యుత్తమ ‘నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ’తో పాటు బ్రిటన్‌లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల సమాఖ్య అయిన ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ భారత్‌లోనే తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన అంగీకారం తెలిపాయి. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ వర్సిటీ తమ క్యాంపస్‌ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను ముమ్మరంగా పరిశీలిస్తోంది.
ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ‘హార్వర్డ్ యూనివర్సిటీ’.. హైదరాబాద్‌లోని డా.ఎన్సీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ రంగ ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ కోర్సులు నవంబరు నుంచే నగరంలో ప్రత్యేకంగా ప్రారంభం కానున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’, ‘స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’, ‘ఆక్స్ఫర్డ్’, ‘కేంబ్రిడ్జ్’, ‘మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’, ‘లండన్ బిజినెస్ స్కూల్’, ‘వర్జీనియా టెక్’, ‘ఇంపీరియల్ కాలేజ్ లండన్’ వంటి దిగ్గజ విద్యాసంస్థల అధిపతులతో విస్తృత స్థాయి చర్చలు జరిపింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో సంయుక్త పరిశోధనా కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సంస్థల నిపుణుల బృందాలు త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి ప్రత్యక్షంగా ఇక్కడి వసతులను పరిశీలించనున్నాయి.
