రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఘనంగా ప్రసంగించారు. ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్’ (AHEAD) సంస్థ ఆధ్వర్యంలో ‘యూనివర్సల్ వన్ నెస్ సెలబ్రేషన్’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో 39 రాష్ట్రాలు, 853 నగరాలు , 250 సంస్థలకు చెందిన సుమారు 6,000 మంది ప్రతినిధులు, 250 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
వివిధ మతాల మధ్య ఐక్యత, సామరస్యం ఉండాలని పిలుపునిచ్చిన ఆయన.. ప్రస్తుతం సమాజంలో మతాలు కేవలం ఆచారాలకే పరిమితం అయ్యాయని, అయితే మతం అసలు ఉద్దేశం మనిషిని సత్యం వైపు నడిపించడమేనని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ఆచారాలు కూడా అవసరమేనని, మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటిచెప్పే సంప్రదాయం ఉన్న సమాజంలో తాను పనిచేస్తున్నానని తెలిపారు.
హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ.. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా అనుకుంటే.. అతడు అసలు హిందువే కాదని మోహన్ భగవత్ తేల్చిచెప్పారు. హిందూ ధర్మం ఎప్పుడూ అందరినీ కలుపుకుపోతుందే తప్ప ఎవరినీ దూరం చేసుకోదని ఉద్ఘాటించారు.
కార్యక్రమ విశేషాలు…
ఈ సమావేశాన్ని నిర్వాహక సంస్థ AHEAD ఒక చారిత్రాత్మక రక్షా బంధన్ సమావేశంగా అభివర్ణించింది. 200లకు పైగా హిందూ అమెరికన్ సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న బిల్ బోర్డుపై మోహన్ భగవత్ పోస్టర్ దర్శనమిచ్చింది. అంతకుముందు మోహన్ భగవత్ న్యూయార్క్‌లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడ నిరాశ్రయులకు స్వయంగా ఆహారాన్ని అందిస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలో పెరుగుతున్న విభేదాలు, ఘర్షణలను రూపుమాపి అందరినీ ఏకం చేసే అద్భుత శక్తి కృష్ణ చైతన్యానికి మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. మనుషుల మధ్య ఎన్ని తేడాలు ఉన్నా.. అంతిమంగా అంతా కృష్ణమయం అనే భావన ప్రతి ఒక్కరి హృదయంలో నిండినప్పుడే ప్రపంచం స్వర్గధామంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు.
