రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్లకు పైగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా తన సైనిక బలగాలను పెంచుకునేందుకు విదేశీయులను నియమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందులో అమెరికన్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సోషల్ మీడియా వేదికగా అమెరికా పౌరులను రష్యా ఆకర్షిస్తోందని, సుమారు 26 వేల డాలర్ల వరకు చెల్లిస్తామన్న హామీతో కనీసం 18 మంది అమెరికా జాతీయులను రష్యా దళాల్లోకి తీసుకున్నట్లు ఆ కథనం పేర్కొంది. వీరిలో కొందరు మాజీ సైనికులు కూడా ఉన్నట్లు సమాచారం.
యుద్ధ రంగంలో రష్యా తరఫున పోరాడేందుకు వచ్చే అమెరికన్లకు 26 వేల డాలర్ల సైనింగ్ బోనస్‌తో పాటు, ప్రతినెలా 2,000 డాలర్ల జీతం ఇస్తామని రష్యా ఏజెంట్లు ఆశ చూపుతున్నారు. టిక్‌టాక్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రచారం చేస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన వారు, అమెరికాపై వ్యతిరేక భావజాలం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా రష్యా సైన్యంలో చేరిన వారిని యుద్ధ రంగంలో ముందువరుసలోకి పంపుతుండటంతో, కొద్దిరోజుల్లోనే వారు ప్రాణాలు కోల్పోతున్నారని ఉక్రెయిన్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, ఉక్రెయిన్‌తో పోరాడేందుకు రష్యాకు ఉత్తర కొరియా భారీగా సైనికులను అందిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఇప్పటికే వేలాది మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాకు చేరుకోగా, తాజాగా మరో 10 వేల మందిని పంపేందుకు కిమ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 50 వేలకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 135 దేశాలకు చెందిన 29 వేల మందికి పైగా విదేశీయులు రష్యా తరఫున పోరాడుతున్నట్లు ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు.
