ఇరాన్‌పై మరోసారి కఠిన చర్యలకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇరాన్ విమానయాన సంస్థల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ విమానాలన్నీ ఇకపై ఎయిర్‌పోర్టులకే పరిమితం కానున్నాయని, సెప్టెంబర్ 23 నుంచే ఈ గ్లోబల్ షట్‌డౌన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఇతర దేశాలకూ హెచ్చరికలు..
టెహ్రాన్ విమానయాన సంస్థలకు ఏవైనా విదేశీ కంపెనీలు సేవలు కొనసాగిస్తే కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెసెంట్ హెచ్చరించారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యే ఇరాన్ విమానాలకు ఇంధనం అందించడం, ల్యాండింగ్ సేవలు లేదా టికెట్ల అమ్మకాలు వంటివి నిర్వహిస్తే ఆ దేశాలను డాలర్ వ్యవస్థ నుంచి బయటకు నెట్టేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇరాన్ ఏవియేషన్ రంగానికి మద్దతునిచ్చే దేశాలను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఇరాక్, జార్జియా, తుర్కియే వంటి దేశాలు ఇరాన్ విమానయాన సంస్థల కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. దీనిపై ఇరాన్ నుంచి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది.
ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్లాన్..
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కేవలం విమానయాన రంగమే కాకుండా, ఇంధన, నౌకా రవాణా, సాంకేతికత, బంగారం , డిజిటల్ ఆస్తుల వంటి ప్రధాన రంగాలను సైతం దెబ్బతీసేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తోంది.
