చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ నెల 23 నుంచి 25 వరకు అమెరికాలో అధికారికంగా పర్యమించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు ఆయన ఈ పర్యటనను చేపట్టారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇద్దరు అగ్రనేతల మధ్య రెండోసారి ఈ చర్చలు జరుగుతుండటం విశేషం. గత మే నెలలో ట్రంప్ బీజింగ్‌కు వెళ్లి జిన్‌పింగ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుత పర్యటన చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని చైనా పేర్కొంది.
భేటీలో లోతైన చర్చలు..
ట్రంప్ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ అమెరికాకు వెళ్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ శాంతి, సుస్థిరత, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ భేటీలో లోతైన చర్చలు జరగనున్నాయి. జిన్‌పింగ్‌కు అరుదైన రీతిలో స్వాగతం పలికేందుకు అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లనున్నారు.
అగ్రనేతల సమావేశం..
వాణిజ్య సుంకాలు, సాంకేతికత, కృత్రిమ మేధ (AI), సైనిక సహకారం, పశ్చిమాసియా ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం , అంతరిక్షంలో ఆయుధ పోటీ వంటి పలు కీలక అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు రానున్నాయి. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100% వరకు వాణిజ్య సుంకాలు విధించే ఆంక్షల చట్టాన్ని ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన నేపథ్యంలో, ఈ సమావేశం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
