రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై 100 శాతం సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరిస్తున్న వేళ, ఆ దేశ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా మిత్రదేశమైన బెలారస్ నుంచి పొటాష్ కొనుగోలు చేయడానికి అమెరికా ఒప్పంద ప్రయత్నాలు చేస్తుండటంపై అమెరికా విదేశాంగ శాఖ మాజీ అధికారి ఇవాన్ ఫైగెన్‌బామ్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం..
రష్యాతో సన్నిహిత సంబంధాలున్న బెలారస్‌తో భారీ పొటాష్ డీల్‌కు యూఎస్ ప్రయత్నిస్తూ, భారత్ చమురు కొనుగోళ్లను తప్పుపట్టడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఫైగెన్‌బామ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి భారత్‌ను బాధ్యులను చేయడం సరికాదని, రష్యా చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని ఒత్తిడి చేయడం భారత విదేశాంగ విధానంలో జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేశారు. మాస్కోను యుద్ధం ఆపేలా చేయడంలో పాశ్చాత్య దేశాలు, ట్రంప్ విఫలమైనందుకు భారత్‌ను నిందించడం తగదని తెలిపారు. భారత్‌ను చైనాతో కలిపి చూడటం అమెరికాకు ఎలాంటి మేలు చేయదని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ ప్రకటన..
బెలారస్ నుంచి భారీగా పొటాష్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం కెనడా నుంచి కొనుగోలు చేస్తున్న దానికంటే తక్కువ ధరకు ఇది లభిస్తుందని తెలిపారు. 2024 గణాంకాల ప్రకారం అమెరికా పొటాష్ దిగుమతుల్లో కెనడా వాటా 79 శాతంగా ఉండగా, రష్యా నుంచి 11 శాతం, బెలారస్ నుంచి 4 శాతం దిగుమతులు జరిగినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరోవైపు రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై కొత్త అమెరికా చట్టం ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
