అమెరికాలో స్థిరపడిన తమ పిల్లల వద్దకు, ముఖ్యంగా ప్రసవ సమయంలో సహాయం చేయడానికి వెళ్లే భారతీయ తల్లిదండ్రులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు (CBP) షాక్ ఇస్తున్నారు. టూరిస్ట్ వీసా (B1/B2) నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ (POE) వద్దే వారిని వెనక్కి పంపడం లేదా బస చేసే కాలాన్ని భారీగా కుదించడం చేస్తున్నారు. తాజాగా ఒక ఎన్నారై తల్లిదండ్రులకు సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 5 నెలల పాటు తమ బిడ్డ వద్ద ఉండేందుకు అమెరికా వెళ్లిన వారికి కేవలం 2 నెలలకే అనుమతి లభించింది. ఈ ఘటన ప్రస్తుతం ప్రవాస భారతీయుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద అసలేం జరిగింది?
సదరు ఎన్నారై తన సోషల్ మీడియాలో పంచుకున్న వివరాల ప్రకారం, ఆయన తల్లిదండ్రులు హైదరాబాద్ నుండి ఖతార్ ఎయిర్వేస్ విమానంలో మయామి చేరుకున్నారు. వారు తమ మనవడు లేదా మనవరాలి పుట్టుక సమయంలో సహాయంగా ఉండేందుకు వెళ్లారు. ఇందుకోసం 5 నెలల పాటు అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుని, ఫిబ్రవరి 11వ తేదీకి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. కానీ అమెరికా ఎంట్రీ పాయింట్ వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారి వారిని సెకండరీ తనిఖీకి పంపారు. “భారతదేశంలో మీకు ఇంకా ఉద్యోగం ఉన్నప్పుడు, సెలవు పెట్టి 5 నెలల పాటు అమెరికాలో ఎందుకు ఉండాలనుకుంటున్నారు?” అని అధికారి సూటిగా ప్రశ్నించారు. తగిన ఆధారాలు చూపించకపోవడంతో, వారికి కేవలం 2 నెలల పాటు మాత్రమే (నవంబర్ 5వ తేదీ వరకు) బస చేసేందుకు ఐ94 (I-94) జారీ చేశారు.
బిడ్డ పుట్టకముందే తిరుగు ప్రయాణం
ఈ 2 నెలల గడువును పొడిగించుకునే అవకాశం ఉందేమో అని ఆ ఎన్నారై ఆరా తీయగా అధికారుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. వారి స్టేటస్‌లో ఎలాంటి మార్పు లేదా గడువు పొడిగింపు (No Extension) ఉండదని అధికారి స్పష్టంగా రాశారు. దీనిపై చట్టపరమైన పరిష్కారం ఏదైనా ఉందేమో అని ఆ ఎన్నారై నెటిజన్ల సహాయం కోరాడు. “మా తల్లిదండ్రులు ప్రసవ సమయంలో సాయంగా ఉండేందుకు వచ్చారు. ఇప్పుడు గడువు పొడిగించకపోతే, బిడ్డ పుట్టడానికి కొద్ది రోజుల ముందే వారు తిరిగి ఇండియాకు వెళ్లిపోవాల్సి వస్తుంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
నెటిజన్ల సలహాలు.. ఆ పొరపాటు చేయకండి!
ఈ పోస్టుపై స్పందించిన నెటిజన్లు అమెరికా వీసా నిబంధనల గురించి పలు కీలక సూచనలు చేశారు. ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ ఉంటే, అది తీవ్రమైన చట్ట ఉల్లంఘన అవుతుందని, భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధం విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద “బిడ్డకు లేదా బాలింతకు సహాయం చేయడానికి వచ్చాము” అని చెప్పకూడదని ఒక నెటిజన్ సూచించాడు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల (USCIS) ప్రకారం, అలా చెప్పడం అంటే ఒక స్థానిక అమెరికన్ కార్మికుడి (నర్స్ లేదా బేబీ సిట్టర్) పనిని లాక్కోవడంగా పరిగణించబడుతుందని తెలిపారు. అది టూరిస్ట్ వీసా నిబంధనలకు విరుద్ధం కాబట్టి అధికారులకు వెంటనే అనుమానం వస్తుందని పేర్కొన్నారు. మొదటిసారి పర్యటనకు వచ్చే వారు 5 నెలల సుదీర్ఘ కాలం పెట్టుకోకుండా, ముందుగా చిన్న చిన్న పర్యటనలు చేయడం సురక్షితమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
