యెమెన్‌లోని హూతీ రెబల్స్ నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టే విషయంలో అమెరికా ప్రత్యక్ష సైనిక సాయం అందించకపోవడంపై సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హూతీలపై వైమానిక దాడులు జరపాలని సౌదీ కోరినప్పటికీ, వాషింగ్టన్ మాత్రం కేవలం ఆయుధాలు, ఇంటెలిజెన్స్ , ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకే పరిమితం కావడం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతోంది.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంబీఎస్ ఎప్పటికీ మరువబోరని, కీలక ప్రయోజనాల సమయంలో అమెరికా తమ కోసం పోరాడదనే విషయం దీనిద్వారా స్పష్టమైందని యూఎస్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కారెన్ గిబ్సన్ వెల్లడించారు.
బ్రిటన్ మద్దతు..
సౌదీ కోరిక మేరకు బ్రిటన్ మాత్రం దళాల ఆత్మరక్షణ కోసం ఎయిర్-టూ-ఎయిర్ రిఫ్యూయలింగ్ సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించి, సౌదీకి బహిరంగంగా మద్దతు తెలిపిన తొలి దేశంగా నిలిచింది. మరోవైపు ఒమన్ మధ్యవర్తిత్వంతో హూతీలతో అమెరికా చర్చలు జరపడం, తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించబోమని హూతీలు హామీ ఇచ్చినట్లు ట్రంప్ ప్రకటించడం సౌదీకి మరింత అసంతృప్తిని తెచ్చిపెట్టింది.
ఎర్రసముద్రంలో హూతీల ఆధిపత్యం..
యెమెన్‌లోని హూతీ రెబల్స్ ఎర్రసముద్ర తీరంతో పాటు అత్యంత కీలకమైన బాబ్ అల్ మాండెబ్ జలసంధిపై పూర్తిస్థాయి పట్టు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌదీకి సుమారు 50 ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగశాఖ నోటిఫై చేసినప్పటికీ, ఈ విమానాలు అందేందుకు కొన్నేళ్ల సమయం పట్టనుంది. మరోవైపు ఈ అంశంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రతినిధులతో న్యూయార్క్‌లో భేటీ కానున్నారు.
