అమెరికాలోని కాలిఫోర్నియాలో విలసిల్లుతున్న ప్రసిద్ధ ‘హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్’ (హిందూ టెంపుల్ ఆఫ్ లివర్మోర్) రాబోయే రోజుల్లో కొన్ని నెలల పాటు నిర్వహించనున్న ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల వివరాల జాబితాను విడుదల చేసింది. 1977 నుంచి సేవలందిస్తున్న ఈ ఆలయం, ప్రవాస భారతీయుల కోసం ఎన్నో వైదిక ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. జులై 28, 2026న గురు పౌర్ణమి వేడుకలతో పాటు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. అలాగే జులై 31 నుంచి పిల్లల కోసం ప్రత్యేకంగా ‘సమ్మర్ కిడ్స్ క్యాంప్’, మెహందీ ఆర్ట్స్ లెర్నింగ్ కోర్సులను ప్రారంభించనున్నారు.
ఆగస్టు , సెప్టెంబర్ నెలలలో వరుసగా పలు పవిత్రోత్సవాలు జరగనున్నాయి:
ఆగస్టు 6: ఆది కృత్తిక వేడుకలు.
ఆగస్టు 14 – 21: అష్ట లక్ష్మీ పూజ , వరలక్ష్మీ వ్రతం.
ఆగస్టు 14 – 16: పవిత్రోత్సవ వేడుకలు.
ఆగస్టు 14: ఆండాళ్ ఆది పూరం.
ఆగస్టు 24 – సెప్టెంబర్ 19: గణేశ చతుర్థి వేడుకలు.
ఆగస్టు 26 – 27: రిగ్/యజుర్ ఉపకర్మ.
సెప్టెంబర్ 3 – 4: శ్రీ కృష్ణ జన్మాష్టమి , గోకులాష్టమి వేడుకలు.
సెప్టెంబర్ 6: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన.
సెప్టెంబర్ 13: స్వర్ణ గౌరీ వ్రతం / హర్తాలిక తీజ్ వ్రతం.
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యువతకు , చిన్నారులకు ఉపయోగపడేలా యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్, బాలాజ్యోతి కోర్సులు (శ్లోకాలు, కథలు), టోస్ట్మాస్టర్స్ ఇంటర్నేషనల్ సమావేశాలు, ఆలయ పుష్పమాలల తయారీ శిక్షణ, కోలాటం తరగతులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, సెప్టెంబర్ మొదటివారం నుంచి ఆరోగ్య సలహా కేంద్రం ద్వారా ఉచిత కౌన్సెలింగ్ సేవలు, ప్రతి నెలా రెండవ శనివారం సీనియర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాలు , ప్రతి ఆదివారం యోగా తరగతులు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
అమెరికాలో సనాతన ధర్మ సంస్కృతిని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది.
