మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, తాజాగా బుక్‌మైషోలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఏ ఇతర పాన్-ఇండియా సినిమాలకూ సాధ్యం కాని రీతిలో వీక్డే అయిన తొలి మంగళవారం రోజే ఈ చిత్రానికి బుక్‌మైషోలో ఏకంగా 3.55 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఇదే సమయంలో ఇతర ప్రముఖ చిత్రాలైన ‘దేవర’కు 2.47 లక్షలు, ‘గేమ్ ఛేంజర్’కు 1.35 లక్షలు, ‘పెద్ది’కి 1.27 లక్షలు, ‘ఓజీ’కి 93 వేల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వీటితో పోలిస్తే ‘ఇరుముడి’కి తొలి మంగళవారం ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం విశేషం. వీక్డే రోజున కూడా ఈ రేంజ్లో టికెట్లు అమ్ముడవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటించగా.. బేబీ నక్షత్ర, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ బాక్సాఫీస్ సునామీతో సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
