మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్‌టాక్‌తో థియేటర్లలో దూసుకెళ్తోంది. కేవలం 12 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో దర్శకుడు శివ నిర్వాణ సినిమా విశేషాలతో పాటు, సీక్వెల్ వార్తలపై స్పందించారు.
రామ్ చరణ్ రూమర్లపై స్పష్టత..
‘ఇరుముడి 2’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడే ఈ వదంతులు మొదలయ్యాయని శివ నిర్వాణ తెలిపారు. మొదట దీన్ని సోషల్ మీడియా పుకారుగానే భావించినా, జర్నలిస్టులు పదేపదే అడగడంతో ప్రేక్షకులు అపోహ పడకూడదని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో భాగం కాదని ఆయన టీమ్ కూడా గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
సీక్వెల్ ఆలోచన లేదు..
రామ్ చరణ్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే తనకు ఎంతో సంతోషకరమేనని శివ నిర్వాణ తెలిపారు. అయితే ప్రస్తుతం ‘ఇరుముడి’కి సీక్వెల్ చేసే ఆలోచన ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ‘ఇరుముడి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేయడంపైనే తమ టీమ్ దృష్టిసారించిందని చెప్పారు. మరోవైపు, శివ నిర్వాణ తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో ధనుష్ లేదా సూర్యతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే చేయనున్నారంటూ ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది.
