పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ గల్ఫ్ దేశాలపై తన ప్రభావాన్ని మరింత పెంచుకునే దిశగా అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.47 వేల కోట్లు) వ్యయంతో భారీ ఎత్తున ఆయుధాలను విక్రయించేందుకు ట్రంప్ యంత్రాంగం ఆమోదం తెలిపింది. ప్రాంతీయ ముప్పులను ఎదుర్కొంటూ తమ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు సౌదీకి ఈ ఒప్పందం దోహదపడుతుందని యూఎస్ పేర్కొంది.
ప్యాకేజీ వివరాలు..
ఈ ఒప్పందంలో భాగంగా సౌదీకి వేల సంఖ్యలో బాంబులు, గైడెన్స్ కిట్లను సరఫరా చేయనున్నట్లు యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది. 5,004 జాయింట్ డైరెక్ట్ ఎటాక్ మ్యూనిషన్ (JDAM) గైడెన్స్ కిట్లు, మరో 5,000 కేఎంయూ-556 జెడామ్ కిట్లను అందజేయనున్నారు. అదనంగా 500 పౌండ్ల బరువున్న 5,004 బాంబులు, 2 వేల పౌండ్ల బరువైన 5,000 బాంబులు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. వీటితో పాటు ఫ్యూజ్ వ్యవస్థలు, టార్గెట్ డిటెక్టర్లు, కంటైనర్లు, విడిభాగాలతో పాటు అమెరికన్ కాంట్రాక్టర్ల నుంచి అవసరమైన సాంకేతిక సహకారం కూడా లభిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా దళాలు , గల్ఫ్ దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలపడుతుందని యూఎస్ అభిప్రాయపడింది.
చారిత్రాత్మక అణు ఒప్పందం..
ఇరాన్ దాడుల నుంచి గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలకు రక్షణ కల్పించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఆయుధ సరఫరా జరుగుతోంది. ఇప్పటికే సౌదీ అరేబియాతో అమెరికా సుదీర్ఘ కాలపు భాగస్వామ్యంలో భాగంగా 30 ఏళ్ల అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే ఈ డీల్ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, రియాక్టర్ల టెక్నాలజీ బదిలీ, ఇంధన సరఫరా, శాస్త్రవేత్తలు , ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వడంలో అమెరికా సౌదీకి పూర్తి స్థాయిలో సహకరించనుంది.
