ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం , సొంత దేశంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో పెద్ద తలనొప్పి వచ్చిపడింది. యుద్ధానికి సంబంధించిన కీలక విషయాలు, ఆయుధ నిల్వల వంటి అత్యంత సున్నితమైన సమాచారం మీడియాకు లీక్ అవుతుండటంపై ట్రంప్ యంత్రాంగం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ రహస్యాలు బయటకు పొక్కుతున్న తీరుపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, లీక్ చేసింది ఎవరో తేల్చేందుకు సైనికాధికారులకు లైడిటెక్టర్ (పాలీగ్రాఫ్) పరీక్షలు నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
పాలీగ్రాఫ్ పరీక్షల వివరాలు..
యూఎస్ మిలిటరీ జాయింట్ స్టాఫ్ విభాగానికి చెందిన దాదాపు 50 మంది అధికారులు , సిబ్బందికి గత నెలలో ఈ నిజ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ విభాగంలో పనిచేస్తున్న 1,500 నుంచి 2,000 మంది సిబ్బందిలో కొందరు మిలిటరీ అధికారులు, పౌర సేవల సిబ్బంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. అమెరికా ఆయుధ నిల్వలు, క్షిపణుల సంఖ్య, అలాగే ఇరాన్‌పై దాడులకు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారా అనే కోణంలో వీరిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్‌తో పాటు మరికొందరి సీనియర్ అధికారులకు ఈ పరీక్షలు నిర్వహించలేదని పెంటగాన్ వర్గాలు తెలిపాయి.
పెంటగాన్ స్పందన ..
ఈ వార్తలపై పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందిస్తూ.. అంతర్గత దర్యాప్తు విషయాలపై తాము బహిరంగంగా మాట్లాడలేమని, అయితే జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీకైతే మాత్రం దాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న అమెరికా సైనికుల భద్రతకు ఈ సమాచారం బయటకు పొక్కకుండా చూడటం చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, సైనిక సిబ్బంది ఉపయోగించే ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా వారి లొకేషన్లు శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు.. వాటిలోని యాడ్ ట్రాకర్లను యూఎస్ మిలిటరీ డిసేబుల్ చేసింది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ప్రత్యేక ఆపరేషన్ల కమాండ్ విభాగాల్లో ఈ భద్రతా చర్యలు అమలవుతున్నాయి.
