ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమురు ధరలపై కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధిస్తే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోతాయని, అమెరికాలో గ్యాసోలిన్ (పెట్రోల్) ధరలు ఒక గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
హర్మూజ్ జలసంధి ప్రభావం..
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల వల్ల తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్, అమెరికాలు నౌకల రాకపోకలను నియంత్రిస్తుండటంతో యుద్ధానికి ముందుతో పోలిస్తే ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికా గెలిస్తేనే మార్కెట్లు మళ్లీ స్థిరపడతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడాన్ని ఎప్పటికీ సహించబోమని, తమపై దాడులు జరిగితే తీవ్రమైన ప్రతిదాడులు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
కెనడాతో తీవ్రమవుతున్న ట్రేడ్‌వార్..
మరోవైపు కెనడాతో వాణిజ్య చర్చలు విఫలమవడంతో ట్రంప్ ఆ దేశంపై కన్నెర్రజేశారు. కెనడాకు చెందిన విమాన తయారీ సంస్థ ‘బాంబార్డియర్’ తన విమానాలను అమెరికాలో విక్రయించడాన్ని నిషేధిస్తామని హెచ్చరించారు. ఆ సంస్థ తయారీ కార్యకలాపాలను పూర్తిగా అమెరికాకు మార్చాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని తేల్చిచెప్పారు. అలాగే ఉత్తర కొరియా నావికాదళంలోకి రెండో అణు విధ్వంసక నౌక చేరిన పరిణామాల నడుమ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
