భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు , అంతరిక్ష రంగంలో ఇరు దేశాల సహకారంపై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక ప్రకటన చేశారు. బెంగళూరులో జరిగిన స్పేస్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రుడిపైకి ప్రయాణంలో భారత్ తమతో కలిసి నడవాలని వాషింగ్టన్ కోరుకుంటోందని స్పష్టం చేశారు.
నాసా ఆహ్వానం..
భారత్ గర్వంగా ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిందని సెర్గియో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే ‘మూన్ బేస్ ప్రోగ్రామ్’లో భాగస్వాములుగా చేరాలని నాసా అధికారికంగా ఇస్రోను ఆహ్వానించిందని తెలిపారు. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టే తదుపరి యాత్రలో అమెరికాకు తోడుగా భారత్ ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
NISAR మిషన్తో ప్రాణాల రక్షణ..
నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్’ (NISAR) మిషన్ ప్రాణాలను రక్షించడంలో సాంకేతికత ఎంతగా దోహదపడుతుందో నిరూపించిందని సెర్గియో కొనియాడారు. రెండు నెలల క్రితం వెనిజువెలాలో సంభవించిన భారీ భూకంప సమయంలో నిసార్ రాడార్ అందించిన డేటా ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. దట్టమైన మేఘాలు, దుమ్మును ఛేదించుకుని నేరుగా భూకంప కేంద్రాన్ని గుర్తించడంలో ఈ సాంకేతికత విజయవంతమైందని, భారత్-అమెరికా కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చనడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
