అమెరికా ఐటీ రంగానికి వెన్నెముకగా భావించే హెచ్-1బీ (H-1B) వీసా కార్యక్రమం భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ వీసా ప్రోగ్రామ్‌ను రాబోయే రోజుల్లో పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందనే సంకేతాలను అమెరికా కార్మిక శాఖ (US Department of Labor) ఇన్ స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డెస్పసీటో పరోక్షంగా వెల్లడించారు. విదేశీ కార్మికుల విధానాలు , వీసా ప్రాసెసింగ్‌లో జరుగుతున్న భారీ అవకతవకలు, మోసాలపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి.
భారీగా బయటపడుతున్న మోసాలు..
హెచ్-1బీ వీసాల కేటాయింపులో లాటరీ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, నకిలీ పత్రాలు , తప్పుడు సమాచారంతో దరఖాస్తులు సమర్పించడం వంటి అనేక అక్రమాలపై యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, లేబర్ డిపార్ట్మెంట్లు దర్యాప్తులను తీవ్రతరం చేశాయి. విదేశీ ఉద్యోగుల ప్రోగ్రామ్‌లలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించామని, పక్కా ఆధారాలతో చట్టపరమైన చర్యలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నేటి పరిస్థితులతో పోలిస్తే రాబోయే కాలంలో అమెరికా విదేశీ లేబర్ సిస్టమ్ పూర్తిగా భిన్నమైన రూపురేఖలను సంతరించుకుంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం..
ఈ ఐటీ వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయడం లేదా మరింత కఠిన నిబంధనలతో పునర్వ్యవస్థీకరించడం వల్ల అత్యధికంగా లబ్ది పొందుతున్న భారతీయ నిపుణులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికాలో ఉద్యోగం చేయాలని, అక్కడ స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది విదేశీ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న కఠిన విధానాలు, రాబోయే చట్టపరమైన మార్పులు అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
