అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి రాజకీయంగా ఒక పెద్ద ఊరట లభించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను పదవి నుంచి తొలగించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభలో చుక్కెదురైంది. ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో 211 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా, కేవలం 204 మంది మాత్రమే మద్దతు పలికారు. దీంతో 211-204 ఓట్ల తేడాతో ఈ తీర్మానాన్ని సభ తిరస్కరించింది.
రిపబ్లికన్ పార్టీ ఐక్యత ..
ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత, ఈ కీలక అంశంపై రిపబ్లికన్ పార్టీ సభ్యులంతా ఏకతాటిపై నిలిచి తమ ఐక్యతను చాటుకున్నారు. సొంత పార్టీకే చెందిన ఎంపీ థామస్ మాస్సీ ఈ అభిశంసన తీర్మానాన్ని తీసుకురాగా, దీనిపై నేరుగా చర్చ గానీ, ఓటింగ్ గానీ జరగకుండా ట్రంప్ యంత్రాంగం అత్యంత వ్యూహాత్మకంగా అడ్డుకుంది. రక్షణ మంత్రి హెగ్సెత్ పదవికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కాపాడేందుకు వైట్‌హౌస్ ఉన్నతాధికారులు, సీనియర్ రిపబ్లికన్ నాయకులు తెరవెనుక తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగించినట్లు తెలుస్తోంది.
మళ్లీ పొంచి ఉన్న ముప్పు..
ప్రస్తుతానికి పీట్ హెగ్సెత్ పదవి సురక్షితంగా బయటపడినప్పటికీ, భవిష్యత్తులో ఆయనకు మరో సవాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన డెమోక్రాట్లు వచ్చే జనవరిలో నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ మంత్రి హెగ్సెత్‌పై మరోసారి అభిశంసన ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
