కాలిఫోర్నియాలో అసెంబ్లీ బిల్లు 268 ప్రకారం దీపావళిని రాష్ట్ర అధికారిక సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో తొలిసారిగా అధికారిక దీపావళి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. 71 స్టీవెన్సన్ స్ట్రీట్‌లోని ఛాన్సరీ 22వ అంతస్తులో జరిగిన ఈ “దివాలి ఆఫ్ లైట్స్” వేడుకకు స్థానిక ప్రజాప్రతినిధులు, దౌత్యవేత్తలు, డయాస్పోరా సభ్యులు పెద్దఎత్తున హాజరయ్యారు. సంప్రదాయ దీపాలు, పూల అలంకరణలు, శాస్త్రీయ కళలు, సంగీతం, పిండివంటలతో ఈ వేడుకను వైభవంగా జరిపారు.
ఈ మిషన్‌కు కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ నాయకత్వం వహిస్తుండగా, కాన్సుల్ నహాస్ అలీ వివిధ ప్రాంతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ కమ్యూనిటీతో మమేకమవుతున్నారు. కాలిఫోర్నియా వ్యాప్తంగా ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ అందిస్తున్న సేవలు, సాంస్కృతిక వారసత్వాన్ని చారిత్రక శాసనసభ మైలురాయి ఘనంగా చాటిచెప్పింది.
