శాన్ హోసేలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శాన్ హోసే పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు ముందు, టల్లీ రోడ్డుపై వైట్ రోడ్డు సమీపంలో తూర్పు దిశగా వెళ్తున్న 2001 మోడల్ నల్లటి అక్యురా సెడాన్ కారు అకస్మాత్తుగా సెంట్రల్ మీడియన్‌ను దాటి పడమర లేన్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆ కారు ఎదురుగా వస్తున్న 2002 మోడల్ నీలిరంగు టెస్లా సెడాన్ కారును ఢీకొట్టింది. టీనేజ్ బాలిక నడుపుతున్న ఈ అక్యురా కారులో మరో బాలిక ప్రయాణికురాలిగా ఉంది.
ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికురాలు ..
ఈ ఘోర ప్రమాదంలో అక్యురా కారులో ప్రయాణిస్తున్న బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న టీనేజ్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఇక టెస్లా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ఒక మహిళను కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వారికి అయిన గాయాలు ప్రాణాంతకం కాదని వైద్యులు వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తు .
మృతి చెందిన బాలిక పేరును పోలీసులు సోమవారం వెల్లడించలేదు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా, ఈ సంవత్సరంలో శాన్ హోసే నగరంలో నమోదైన 43వ ట్రాఫిక్ సంబంధిత మరణం ఇదే కావడం గమనార్హం.
