అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వలస వ్యతిరేక చర్యలు, ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరుపై లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికైన నిత్య రామన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాయ్ల్ హైట్స్ ప్రాంతంలోని వైట్ మెమోరియల్ హాస్పిటల్ వద్ద ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ (ICE) అధికారులు ప్రవర్తించిన తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ఎమర్జెన్సీ వార్డు మార్గానికి ఆటంకం కలిగించడమే కాకుండా, ఇద్దరు అమెరికన్ పౌరులను కూడా అధికారులు నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ట్రంప్ పరిపాలనలోని అజాగ్రత్త, కఠిన వైఖరికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా ఆమె విమర్శించారు.
బాధితులకు మద్దతు , భరోసా..
ఈ ఘటన జరిగిన మరుసటి రోజున నిత్య రామన్ స్థానిక ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులతో కలిసి నిరసన తెలిపి, అధికారుల చర్యలపై పారదర్శకమైన విచారణకు డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వలసదారులపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు స్పష్టంగా తిరస్కరించారని ఆమె వ్యాఖ్యానించారు. నగర ప్రజల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, ICE అధికారుల చర్యలకు నగర వనరులను ఏమాత్రం ఉపయోగించనివ్వమని ఆమె స్పష్టం చేశారు. అలాగే బాయ్ల్ హైట్స్ నివాసితులకు తాము అండగా ఉంటామని, ఇది వారి నగరమని భరోసా ఇచ్చారు.
అత్యవసర సహాయక నంబర్ల ప్రకటన..
వలసదారుల హక్కుల పరిరక్షణ , అత్యవసర సహాయం కోసం నిత్య రామన్ కొన్ని కీలక హెల్ప్‌లైన్ నంబర్లను వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ చర్యల వల్ల ప్రభావితమయ్యే బాధితులు ఎల్ఏ రైడ్స్ , రాపిడ్ రెస్పాన్స్ నెట్వర్క్ (888-624-4752), ఇమ్మిగ్రెంట్ డిఫెండర్స్ లా సెంటర్ (213-833-8283), , బీహెచ్ఐఆర్ఎన్ రాపిడ్ రెస్పాన్స్ (323-805-1049) నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
