ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒంగోలు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో డిసెంబర్ 5, 6 తేదీలలో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు – బాలలు కార్యక్రమాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించనున్నట్లు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా దివ్యశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ వేదికపై 16 ఏళ్ల లోపు బాలబాలికల కోసం కరోకే మాధ్యమం ద్వారా ‘పాడనా తెలుగు పాట’ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఎంపిక విధానం ..
ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తిగల అభ్యర్థులు ప్రాథమిక పరిశీలన కోసం కరోకే మాధ్యమం ద్వారా రెండు గీతాలను రికార్డు చేయాలి. ఆ రికార్డింగ్‌లను [email protected] ఈమెయిల్ ద్వారా శ్రీ జొన్నలగడ్డ వల్లీ శ్రీవిద్యకు సెప్టెంబర్ 30 లోపు పంపాల్సి ఉంటుంది. పరిశీలనలో ఎంపికైన వారికి అక్టోబర్ 15 లోపు నేరుగా సమాచారం అందిస్తారు.
ప్రత్యేక సత్కారం..
ఎంపికైన అభ్యర్థులు సోలో , యుగళ గీతం రూపంలో రెండు పాటలు పాడవలసి ఉంటుంది. తెలుగు సాహిత్య, సంగీత విలువలు ఉన్న గీతాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అశ్లీలమైన గీతాలు లేదా జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే పాటలకు అనుమతి లేదు. ఫైనల్స్‌కు ఎంపికైన వారికి స్థానిక డార్మెటరీ వసతితో పాటు రవాణా సదుపాయం కల్పిస్తారు. వేదికపై ప్రదర్శన ఇచ్చే వారికి ప్రశంసా పత్రం, శాలువా , పతకంతో సత్కారం ఉంటుందని కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజి, సమన్వయకర్తలు డాక్టర్ కే. మురళీధర్ రెడ్డి, శ్రీ కోగంటి శ్రీకాంత్ తెలిపారు.
