అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో నెదర్లాండ్స్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడా దేశాల నుంచి బిలియన్ డాలర్ల విలువైన 86 టన్నుల బంగారాన్ని కొద్ది నెలల వ్యవధిలో లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు తరలించి భద్రపరిచింది. ఈ విషయాన్ని డచ్ సెంట్రల్ బ్యాంక్ (DNB) అధికారికంగా ధ్రువీకరించింది. సంక్షోభ సమయాల్లో బంగారాన్ని సులభంగా ట్రేడ్ చేయడానికి వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
బంగార తరలింపు ఆపరేషన్ ఇలా..
ఈ సంవతసరం మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేశారు. తొలుత కెనడా, అమెరికా బ్యాంకుల నుంచి 27 టన్నుల బంగారాన్ని నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చేర్చారు. మిగిలిన పుత్తడిని నేరుగా న్యూయార్క్ నగరంలో విక్రయించి, లండన్‌లో తిరిగి కొనుగోలు చేశారు. రవాణాలో ఎదురయ్యే ఇబ్బందులు, నష్టభయాలను బేరీజు వేసుకుని వివిధ దశల్లో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
లండన్‌కే ఎందుకంటే..?
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మార్కెట్ అయిన లండన్‌లో కొనుగోళ్లు, విక్రయాలు , తాకట్టు పెట్టడం అత్యంత సులువు. ఇక్కడ ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కలిగి ఉంది. బాంబు దాడులను సైతం తట్టుకునేలా, దొంగలు కన్నం వేయడానికి వీలులేని రీతిలో దీని వాల్ట్‌ను నిర్మించారు. థ్రెడ్ నీడిల్ స్ట్రీట్‌లో ఉన్న ఈ ఖజానాలో ప్రపంచంలోని ఐదో వంతు బంగారం నిల్వ ఉంది. ఇందులో 90 శాతానికి పైగా సుమారు 30 దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రముఖ సంస్థలకు చెందినదే కావడం విశేషం. ఇక్కడ బంగారం ఉంటే దేశాల మధ్య లావాదేవీలు కేవలం సిబ్బంది ఒక అర నుంచి మరో అరలోకి మార్చడం ద్వారా ఎంతో సులభంగా జరిగిపోతాయి.
అనిశ్చితి పరిస్థితుల నేపథ్యం..
ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్ నడుస్తుండటం, రెండు దేశాలు పరస్పరం సుంకాలు విధించుకోవడం తెలిసిందే. మరోవైపు ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో పడింది. ఈ ప్రభావం అంతా ప్రపంచ వాణిజ్యంపై పడుతున్న తరుణంలో, నెదర్లాండ్స్ తన బంగారాన్ని సురక్షిత ప్రాంతమైన లండన్‌కు మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది.
